Harbhajan Singh : భారత జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీలో రాణించాలి. లేదంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మెరుపులు మెరిపించాలి. అప్పుడే సెలక్టర్ల దృష్టిలో పడతారు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) ఇప్పుడదే చేస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో సంచలన ఆట తీరుతో క్రికెట్ పండితులను ఆశ్చర్యపరుస్తున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఈ యంగ్‌స్టర్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ప్రశంసలు కురిపించాడు. అతను టీమిండియా తలుపు తట్టడం లేదని, తలుపు బద్ధలు కొడుతున్నాడని అన్నాడు. అంతేకాదు యశస్వీని వరల్డ్ కప్‌లో ఆడించాలని అతను సెలక్టర్లకు సూచించాడు.
’21 ఏళ్ల యశస్వీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు అవకాశం కోసం టీమిండియా తలుపు తట్టడం లేదు. బద్ధలు కొడుతున్నాడు. ఉప్పెనలా విరుచుకుపడుతున్నాడు’ అని భజ్జీ తెలిపాడు. అండర్ -19 వరల్డ్ కప్ హీరో యశస్వీ ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అత్యధిక పరుగుల(11 ఇన్నింగ్స్‌ల్లో 574 రన్స్) వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ 576 పరుగులతో మొదటి ప్లేస్‌లో ఉన్నాడు. అతడు ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మీద సెంచరీతో చెలరేగిన అతను నిన్న రాత్రి కోల్‌కతాపై వేగవంతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. 13 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు.
150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls.
Scorecard – https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI
— IndianPremierLeague (@IPL) May 11, 2023
ఈడెన్స్ గార్డెన్లో యశస్వీ సునామీలా విరుచుకుపడ్డాడు. కోల్‌కతా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో వీరవిహారం చేశాడు. నితీశ్ రానా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో యశస్వీ చితక్కొట్టాడు. వరుసగా 6, 6, 4, 2, 4, 4 బాదాడు. దాంతో 26 పరుగులు రాబట్టాడు. హర్షిత్ రానా వేసిన రెండో ఓవర్లోనూ అతను జోరు కొనసాగించాడు. ఫోర్, సిక్స్ బాదాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 3వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన యశస్వీ సింగిల్ తీసి యాభై రన్స్ సాధించాడు. 13 బంతుల్లోనే అతను 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం బాది చరిత్ర సృష్టించాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ రికార్డును బద్ధలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. యశస్వీ (98 నాటౌట్), సంజూ శాంసన్(48 నాటౌట్) ధనాధన్ ఆడడంతో రాజస్థాన్ 9 వికెట్లతో కోల్‌కతాను చిత్తు చేసింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. దాంతో, ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది.