Indian Woman | అమెరికాలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా రావు గొడిశాల (27) అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. కత్తిపోట్లతో అతని అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అయితే అంతకుముందే అమె మాజీ బాయ్‌ఫ్రెండ్ దేశం విడిచి పారిపోయాడు. దానికంటే ముందు నిఖిత కనిపించడం లేదని అతనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
నిఖిత కనిపించడం లేదని జనవరి 2వ తేదీన అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా తనను తన అపార్ట్మెంట్లో డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం చూశాడనని వెల్లడించారు. ఈ మేరకు సెర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు.. అర్జున్ ఉండే అపార్ట్మెంట్లో జనవరి 3వ తేదీన సోదాలు నిర్వహించారు. అప్పుడే కత్తిపోట్లతో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అర్జున్ కోసం ఆరా తీయగా.. జనవరి 2వ తేదీ సాయంత్రమే భారత్‌కు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడే నిఖితను హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డ్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్ను గుర్తించేందుకు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిఖిత హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై భారత దౌత్య కార్యాలయం స్పందించింది. నిఖిత కుటుంబసభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని.. అవనసరమైన అన్ని దౌత్య సహాయాలను అందిస్తామని వెల్లడించింది. స్థానిక అధికారులతో కూడా నిరంతరం ఫాలో అప్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా, నిఖిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్‌లో ఉన్నట్లుగా ఆమె సోషల్‌మీడియా ఖాతాల ఆధారంగా తెలుస్తోంది. కానీ ఆమె భారత్‌లో ఏప్రాంతానికి చెందిన యువతి అన్నది మాత్రం కచ్చితంగా అధికారులు ప్రకటించలేదు.