సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మటన్ షాప్‌లో గొర్రెలు.. మేకల నుంచి రక్తం తీసి దాచిపెడుతున్నారని… ఇదేంటి రేపో మాపో కోసే మటన్ దుకాణాంలో రక్తం తీసి ఏం పని చేస్తున్నారంటూ నగర శివారు ప్రాంతంలో ఒక్కసారిగా ఆదివారం ఉదయం ఆలజడి నెలకొంది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. పశువుల నుంచి రక్తం సేకరించడం సాధారణ ప్రక్రియలో భాగమేనని, అయితే కీసరలో నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారు పశువుల నుంచి రక్తం సేకరిస్తున్నారని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
పశువైద్యుల పర్యవేక్షణలో రక్తం సేకరించడం సాధారణమేనన్నారు. కీసర నాగారంలోని సత్యనారాయణ కాలనీలో సుందర్ సోను.. సోను మటన్ అండ్ చికెన్ పేరుతో మటన్ దుకాణం నిర్వహిస్తుండగా అతని వద్ద అఖిల్ పనిచేస్తున్నాడు. సుందర్ సోను గతంలో గోట్ ఫామ్‌లలో పనిచేశాడు. ఆ ఆయా గోట్ ఫామ్‌లలో నుంచి పశువైద్యుల పర్యవేక్షణలో రక్తం సేకరించి, దానిని విదేశాల్లోని ల్యాబ్‌లకు పంపించేవారు. రక్తం తీయడం, ల్యాబ్‌లకు అమ్మడంపై మటన్ దుకాణం నిర్వాహకులకు అనుభవం ఉంది. దీంతో కొన్నాళ్ల క్రితం నుంచి సుందర్ సోను స్వయంగా మటన్ దుకాణంలో రక్తం తీయడం మొదలు పెట్టాడు. ఇలా కొన్నాళ్ల నుంచి మటన్ కోసం తెయ్చే మేకలు, గొర్రెల నుంచి రక్తం తీస్తున్నాడు. వాటిని కోసే ఒకటి రెండు రోజుల ముందే రక్తం తీసి వాటిని నిల్వ చేస్తున్నాడు.
ఈ రక్తాన్ని కాచిగూడలో ఉన్న ఒక ల్యాబ్‌కు విక్రయిస్తున్నాడు. అయితే పశువైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ఈ తతంగమంతా తానే స్వయంగా చేస్తూ నిబంధనలను పాటించడం లేదు. దీంతో కీసర పోలీసులు విశ్వసనీయ సమచారంతో ఈ మటన్ దుకాణంపై దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిం ది. పశువుల రక్తం దొరికిందంటూ తెలియడంతో.. ఈ రక్తంతో ఏం చేస్తున్నాడు.. మనుషులకు ఇస్తున్నాడా..? ఇంకా ఏదైనా క్షుద్ర పూజలకు వాడుతున్నాడా? రక్తం సేకరించడం వెనుక ఏముందోనని స్థానికంగా చర్చ మొదలైంది. అయితే పశువుల నుంచి రక్తం సేకరించడం అనేది సాధారణ ప్రక్రియలో భాగమేనని తేలడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కీసర సీఐ
కీసర, జనవరి 4; మేకలు, గొర్రెల నుంచి రక్తాన్ని సేకరించి నిల్వ చేస్తూ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేస్తున్న చికెన్, మటన్ షాప్‌ల మీద కీసర పోలీసులు దాడులు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలోని మటన్, అండ్ చికెన్ సెంటర్లో గత కొన్ని నెలల నుంచి మేకలు, గొర్రెల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ షాప్‌లో ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేశారు. నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న సోను మటన్ అండ్ చికన్ సెంటర్లో గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రెండు దుకాణాల మీద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాప్ యజమాని సుందర్ సోను, అఖిల్ అనే ఇద్దరు వ్యక్తులు గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి, 130 బ్యాగుల్లో నిల్వ చేసినట్లు గుర్తించారు. ఈ రక్తాన్ని కాచిగూడలోని (సీఎస్కే) ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలకు విక్రయిస్తున్నారని, ల్యాబరేటరీల్లో ఉపయోగించే షిప్ బ్లడ్ అగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని జీఎచ్ఎంసీ అధికారులు, వెటర్నరీ డిపార్ట్మెంట్కు అప్పగించిన్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని కీసర సీఐ ఆంజనేయులు హెచ్చరించారు.