కోల్‌కతా : తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటమిని ఎదుర్కున్న భారత జట్టు ఆటతీరుతో పాటు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బందించి చిత్తు చేద్దామని భావించిన టీమ్ఇండియా.. తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టుగా సఫారీ స్పిన్ తంత్రానికి బలైంది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం పలువురు మాజీ క్రికెటర్లు భారత బ్యాటింగ్ బలహీనతలు, కోచ్ గంభీర్ వ్యూహాలపై ధ్వజమెత్తగా మరికొందరు పిచ్‌ను నిందిస్తున్నారు. హర్భజన్ సింగ్ వంటి మాజీలైతే ఏకంగా బీసీసీఐ తీరునే తప్పుపట్టాడు.
మ్యాచ్ అయ్యక తన యూట్యూబ్ ఛానెల్లో హర్భజన్ మాట్లాడుతూ.. ‘వారు టెస్టు క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నారు. వాళ్లు చాలా ఏండ్లుగా ఇలాంటి పిచ్‌లను తయారుచేస్తున్నారు. జట్టు గెలిచినప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. కొంతమంది ఆటగాళ్లు ఆ పిచ్‌లపై వికెట్లు తీసి గొప్ప బౌలర్లుగా గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడది వర్క్‌వుట్ అవడం లేదు. బ్యాటర్లు పరుగులు ఎలా రాబట్టాలో తెలియనప్పుడు వాటిని తయారుచేయడం దేనికి’ అని ప్రశ్నించాడు. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కే సహకరిస్తే సమర్థవంతమైన బ్యాటర్, బౌలర్ మధ్య తేడా ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. టెస్టులు ఆడే పిచ్‌లను బంతికి బ్యాట్‌కు సమానంగా తయారుచేయాలని.. దానిని అలా ఆడితేనే ఆటకు అందమని తెలిపాడు. 2001లో ఆస్ట్రేలియాతో ఆడిన చారిత్రాత్మక టెస్టులో ఇదే పిచ్‌పై భజ్జీ 13 వికెట్లు తీసిన విషయం విదితమే. ఇదిలాఉంటే మాజీ సారథి గంగూలీ మాత్రం.. పిచ్‌ను తప్పు పట్టాల్సిన అవసరమే లేదని, భారత జట్టు కోరుకున్న విధంగానే రూపొందించామని చెబుతూ క్యూరేటర్‌ను వెనుకేసుకొచ్చాడు.

తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ పట్టేయడంతో నొప్పితో మైదానాన్ని వీడిన భారత సారథి శుభ్‌మన్ గిల్ రెండో టెస్టు ఆడేది అనుమానంగానే ఉంది. షెడ్యూల్ ప్రకారం బుధవారం భారత జట్టు.. కోల్‌కతా నుంచి గువహతి (రెండో టెస్టు వేదిక)కి వెళ్లాల్సి ఉంది. కానీ జట్టుతో కలిసి అతడు ప్రయాణించడం లేదని క్రికెట్ అసోసియేషయన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారం జరిగిన టీమ్ ఆప్షనల్ ట్రైనింగ్‌లోనూ గిల్ పాల్గొనలేదు. ‘అతడి మెడకు తీవ్రమైన నొప్పి ఉంది. నెక్ కూలర్‌ను ధరించి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతడిని మూడు, నాలుగు రోజులు విరామం తీసుకోవాలని, ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది’ అని క్యాబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ గిల్ గనుక రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానాన్ని సాయి సుదర్శన్ లేదా నితీశ్ కుమార్ రెడ్డిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశముంది.