Harbhajan Singh : భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్లో ముంబై హిందీ మాట్లాడేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన భజ్జీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రోహిత్ జట్టులో చేరిన కొత్తలో ముంబై స్లాంగ్ హిందీ మాట్లాడేవాడు. ‘కైసా హై రే తూ?, కైసా హై షానే?’ వంటి పదాలు ఎక్కువగా ఉపయోగించేవాడని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. ‘రోహిత్ నాకు చాలా రోజులుగా తెలుసు.
అతను తొలిసారిగా దక్షిణాఫ్రికాలో 2007లో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో జట్టుతో కలిశాడు. టీమ్ బస్సులో అతను నా వెనకాలే కూర్చునేవాడు. రోహిత్ తరచూ ముంబై లోకల్ హిందీ మట్లాడేవాడు. అతను చాలా మంచి వ్యక్తి’ అని భజ్జీ అన్నాడు.
అంతేకాదు రోహిత్ భవిష్యత్తులో గొప్ప క్రికెటర్ అవుతాడని అనుకున్నానని హర్భజన్ తెలిపాడు. ‘రోహిత్‌ను చూశాక.. అతను సుదీర్ఘ కాలం భారత్‌కు ఆడతాడని, ప్రపంచ క్రికెట్లోని గొప్ప బ్యాటర్లలో ఒకడు అవుతాడని అనిపించింది. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అతను ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడో మనకు తెలిసిందే. అతను బెస్ట్ క్రికెటర్. అంతకంటే పది రెట్లు ఉత్తమమైన వ్యక్తి’ అని ఈ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. హర్భజన్, రోహిత్ శర్మ .. ఇద్దరూ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు.
రోహిత్ 2007లో టీ20ల్లో ఆరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన తొలి పొట్టి ప్రపంచకప్ జట్టులో అతను సభ్యుడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని యువ భారత్ ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి విజేతగా అవతరించింది. ప్రస్తుతం మేటి ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. అతని ఖాతాలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా రోహిత్ గుర్తింపు సాధించాడు. అంతేకాదు ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.