తాష్కెంట్: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. చైనాలోని హంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య జరుగాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (వోసీఏ) ప్రకటించింది. ఒలింపిక్ కమిటీ (సీవోసీ), హంగ్జౌ ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ, ఆసియా ఒలింపిక్ మండలి (వోసీఏ)లు శుక్రవారం సమావేశమై ఆసియా క్రీడల నిర్వహణపై చర్చించాయి.
క్రీడా పోటీలు వాయిదా వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆసియా ఒలింపిక్ మండలి ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వాయిదాకు కారణం తెలుపకపోయినా.. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి తీవ్రమవుతుండటంతో చైనా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నది. దీంతో పాటు మరికొన్ని టోర్నీల నిర్వహణలో మార్పులు జరిగాయి. ఆసియా యూత్ గేమ్స్ రద్దు చేయగా.. ప్రపంచ విశ్వవిద్యాలయ గేమ్స్ వాయిదా పడ్డాయి. టూ డైమండ్ లీగ్ ట్రాక్ చైనాలో కాకుండా పోలాండ్‌లో నిర్వహించనున్నారు.
ఆసియా గేమ్స్‌లో మొత్తం 61 క్రీడాంశాల్లో 11 వేల మంది అథ్లెట్లు పోటీ పడాల్సి ఉంది. 2024 ఒలింపిక్స్లోపు ఆసియా క్రీడలను నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2023లో ఈ పోటీలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రీడాటోర్నీ వాయిదాతో భారత అథ్లెట్లు నిరాశకు గురవగా.. మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభించిందని భావిస్తున్నారు. ‘ప్రతిష్ఠాత్మక క్రీడోత్సవాలు ఏవీ వాయిదా పడినా అథ్లెట్లకు నిరాశే’ అని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపాడు.
చైనాలోని శంతను వేదికగా డిసెంబర్ 20-28 మధ్య జరుగాల్సిన మూడో ఆసియా యూత్ క్రీడలు రద్దయ్యాయి. తదుపరి టోర్నీ 2025లో ఉజ్బెకిస్థాన్‌లో జరుగనుంది.
ప్రపంచ విశ్వవిద్యాలయ గేమ్స్ వాయిదా చైనాలోని చెంగ్డూ వేదికగా జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరుగాల్సిన ప్రపంచ విశ్వవిద్యాలయ గేమ్స్‌ను అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా సమాఖ్య (ఫిసు) వాయిదా వేసింది. 2023లో నిర్వహించాలని ఫిసు భావిస్తున్నది.
ఆసియా క్రీడల కోసం అథ్లెట్లు అందరూ ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. వాయిదా అనేది మా చేతుల్లో ఏమీ లేదు. అంతా కరోనా వలనే. ఈ నిర్ణయం మమ్మల్ని నిరాశకు గురి చేసింది. అక్కడి పరిస్థితుల కారణంగా వాయిదా పడిందని అనుకుంటున్నాం. దీన్ని మేం సానుకూల పరిణామంగా భావిస్తున్నాం.
– పీఆర్ శ్రీజేశ్, భారత హాకీ గోల్ కీపర్
ఆసియా క్రీడలు వాయిదా పడడం మాకు మేలు చేస్తుంది. ఏడు రోజుల వ్యవధిలో రెండు ప్రధాన టోర్నీలు ఎదుర్కోలేక భారత ప్లేయర్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశముంది. వాయిదాతో మేం ఇప్పుడు పూర్తిగా డేవిస్ కప్‌పై దృష్టి సారిస్తాం. అనంతరం ఆసియా క్రీడలపై ఫోకస్ ఉంచుతాం.
– అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ)