Gurukula Students | రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపై తమ విద్వేషాన్ని చాటుతూనే ఉన్నది. ఇప్పటికే సరైన ఆహార, వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను ఇంకా సతాయిస్తున్నది. సోమవారం భారత్, మలేషియా మధ్య జరిగిన ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం గురుకుల విద్యార్థులను గచ్చిబౌలి స్టేడియానికి తరలించింది. హయత్నగర్, ఇబ్రహీంపట్నం గురుకులాలకు చెందిన పిల్లలను ఆర్టీసీ బస్సుల్లో స్టేడియానికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సాకర్ మ్యాచ్కు సరైన ఆదరణ లేకపోవడంతో.. స్టేడియంలోని స్టాండ్లను నింపేందుకు అధికారులు ఇలా చేసినట్లు తెలిసింది. రాత్రి 7.30కు మొదలయ్యే మ్యాచ్ కోసం మధ్యాహ్నం 3 గంటలకే తమను హాస్టళ్ల నుంచి తరలించినట్లు విద్యార్థులు చెప్పుకొచ్చారు. హాస్టల్లో లంచ్ ముగిసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారని, స్టేడియానికి వచ్చిన తర్వాత స్నాక్స్ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత బస్ల కోసం ఎదురుచూసిన పిల్లలు తిరిగి తమ వసతి గృహాలకు చేరుకునేందుకు చలిలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్టేడియంలో ఖాళీ స్టాండ్లను నింపేందుకు గురుకుల పిల్లలను తీసుకురావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తున్నారు.