గురుకుల విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు వెలుగు దివ్వెలుగా విరాజిల్లుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ వారి ప్రతిభను వెలికి తీస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పుణికిపుచ్చుకుంటూ అటు చదువులతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు పతకాల పంట పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మట్టిలో మాణిక్యాలను బయటికి తీస్తున్నారు. ప్రతిభకు పదునుపెడుతూ అత్యుత్తమ శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దుతున్నారు.
అనుభవజ్ఞలైన కోచ్‌ల సహరంతో అంచలంచెలుగా ఎదుగుతూ తాము ఎంచుకున్న క్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఫ్రాన్స్ వేదికగా ఈనెల 14 నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీకి గురుకులాలకు చెందిన మాయావతి, రవికిరణ్, ప్రణయ్ ఎంపికై సత్తాచాటారు. ఇప్పటికే జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొట్టిన ఈ ముగ్గురు ఫ్రాన్స్ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలన్న పట్టుదలతో ఉన్నారు. మెగాటోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్న నేపథ్యంలో‘నమస్తే తెలంగాణ’ వారిని పలుకరించింది.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: ‘కృషి ఉంటే మనుషుల రుషులు అవుతారు..మహా పురుషులు అవుతారు’ దిగ్గజ పాటల రచయిత వేటూరి అన్నట్లు..సాధించాలన్న పట్టుదలకు కృషి తోడైతే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. గురుకుల విద్యార్థులు ఇది చేతల్లో చూపిస్తున్నారు. పూట గడువని కడు పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులు తమ కలల సాకారం దిశగా అడుగులు వేస్తున్నారు. తాము ఎంచుకున్న ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ఉజ్వల భవితకై ముందుకు సాగుతున్నారు. ఈ పూటకు కడుపు నిండితే చాలు అనుకున్న ఎంతో మంది పేద పిల్లలు ఈనాడు..గురుకుల పాఠశాలలతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఉపాధ్యాయులు, కోచ్‌ల మద్దతుతో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ వేదికగా జరుగనున్న వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీలో పతకమే లక్ష్యంగా మాయావతి, ప్రణయ్, రవికిరణ్ బరిలోకి దిగుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులతో అంచనాలకు మించి రాణిస్తున్న ఈ త్రయం తమ లక్ష్యాలను వివరించింది.
మాయావతి
దిండి గురుకుల విద్యాలయం(నల్లగొండ)
పోటీపడుతున్న విభాగాలు: 100మీ, 200మీ
100మీటర్ల బెస్ట్ టైమింగ్: 12.36 సెకన్లు
200 మీటర్ల బెస్ట్ టైమింగ్: 24.59 సెకన్లు
ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీ: 2.50 లక్షలు
దిండి గురుకుల విద్యాలయంలో ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మాయావతి..వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీలో రెండు విభాగాల్లో బరిలోకి దిగుతున్నది. ఇప్పటికే జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటిన మాయావతి..ఇటీవల భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎస్జీఎఫ్ఐ టోర్నీలో రెండు పసిడి పతకాలతో మెరిసింది. దీని ద్వారా ఫ్రాన్స్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. అంతర్జాతీయ టోర్నీలో తొలిసారి పోటీపడబోతున్న ఈ అమ్మాయి కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని మెండైన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ టోర్నీకి సన్నద్ధతపై స్పందిస్తూ ‘కోచ్ పరుశరాం నేతృత్వంలో మెరుగైన శిక్షణ తీసుకుంటున్నాం. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు కఠోర సాధన చేస్తున్నా. ఫ్రాన్స్ టోర్నీలో కచ్చితంగా పతకం సాధిస్తానన్న గట్టి నమ్మకం ఉంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీలో మొదటిసారి పోటీపడుతున్నా..ఎలాంటి ఒత్తిడి లేకుండా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నా’ అని అంది. నల్లగొండ జిల్లా దిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన మాయావతిది వ్యవసాయ కూలీ కుటుంబం. ముగ్గురు సంతానం. భవిష్యత్‌లో ఎలాగైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్నదే తన కల అని మాయావతి పేర్కొంది.
ప్రణయ్
జైపూర్ గురుకుల విద్యాలయం(మంచిర్యాల)
పోటీపడుతున్న విభాగం: ట్రిపుల్ జంప్
ట్రిపుల్ జంప్ బెస్ట్ టైమింగ్: 14.52 మీటర్లు
ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీ: రూ.4.50 లక్షలు
జైపూర్ గురుకుల విద్యార్థి అయిన కొత్తూరి ప్రణయ్..ఫ్రాన్స్ మెగాటోర్నీలో ట్రిపుల్ జంప్‌లో బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రణయ్..ఇప్పటికే జాతీయస్థాయి టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టాడు. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దగ్గర ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ పొందుతున్న ప్రణయ్..వరల్డ్ స్కూల్‌గేమ్స్‌లో ఎలాగైనా సత్తాచాటాలని చూస్తున్నాడు. భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ ఎస్జీఎఫ్ఐ టోర్నీ ట్రిపుల్ జంప్‌లో రజతం, లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఫ్రాన్స్ టోర్నీలో పోటీపై స్పందిస్తూ ‘కోచ్ రమేశ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాం. ఆయనకున్న సుదీర్ఘ అనుభవంతో మమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో జంపింగ్ ప్రాక్టీస్‌తో పాటు ఫిట్నెస్ కాపాడుకునేందుకు ప్రత్యేక తర్ఫీదు పొందుతున్నాం. వరల్డ్ స్కూల్ గేమ్స్‌లో కచ్చితంగా పతకం గెలుస్తామన్న నమ్మకం నాకుంది’ అని ప్రణయ్ అన్నాడు. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్‌ది పేద కుటుంబం. తన తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తారని ప్రణయ్ చెప్పుకొచ్చాడు. పతకంతో స్వదేశానికి తిరిగి వస్తానని ఈ కుర్రాడు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
రవికిరణ్
జైపూర్ గురుకుల విద్యాలయం(మంచిర్యాల)
పోటీపడుతున్న విభాగాలు: 100మీటర్లు, జావెలిన్ త్రో
100మీటర్లు బెస్ట్ టైమింగ్: 13.40సెకన్లు
జావెలిన్ త్రో బెస్ట్: 24 మీటర్లు
మంచిర్యాల జిల్లా కొత్తపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన రవికిరణ్ పుట్టినప్పుడే పోలియో బారిన పడ్డాడు. అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆటల పట్ల మక్కువ పెంచుకున్నాడు. అటు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ అంచలంచెలుగా పైకి ఎదిగాడు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ ఎస్జీఎఫ్ఐ టోర్నీలో రెండు పసిడి పతకాలతో మెరిసి ఆకట్టుకున్నాడు. 100మీటర్ల విభాగంతో పాటు జావెలిన్‌త్రోలో అంచనాలకు మించి రాణిస్తూ ఈ యువ పారా అథ్లెట్ ఫ్రాన్స్ టోర్నీకి ఎంపికయ్యాడు. గురుకుల సొసైటీ సహకారంతో రమేశ్ దగ్గర శిక్షణ పొందుతున్న రవికిరణ్ రెండు విభాగాల్లో సత్తాచాటుతానని చెప్పుకొచ్చాడు.