గడిచిన రెండేండ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న 36వ జాతీయ క్రీడలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరుగబోయే ఈ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్ లో జాతీయ క్రీడలను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వాస్తవానికి 2020 మే లో గోవాలో జరగాల్సి ఉన్న 36వ జాతీయ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. గతేడాది కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. కానీ ఈసారి మాత్రం ఈ క్రీడలను ఎలాగైనా నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కంకణం కట్టుకుంది.
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఈ క్రీడలను నిర్వహించనున్నారు. మొత్తం 34 క్రీడా ఈవెంట్లు ఉండే నేషనల్ గేమ్స్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావ్ నగర్ లో నిర్వహించనున్నారని ఐవోఏ వెల్లడించింది.
ఇదే విషయమై గుజరాత్ క్రీడా శాఖ మంత్రి హర్ష్ సంఘ్వి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది గుజరాత్ లో పలు క్రీడా రికార్డులు బద్దలు కానున్నాయి. కొత్త రికార్డులు నమోదవుతాయి. 36వ జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తాం..’ అని తెలిపారు. గుజరాత్ లో తొలిసారి జాతీయ క్రీడలను నిర్వహించే అవకాశమిచ్చినందుకు ఐవోఏకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.