ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. తాజా సీజన్లో పట్టిందల్లా బంగారంలా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట నెగ్గిన హార్దిక్ సేన.. 16 పాయింట్లతో అనధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది! లక్ష్యఛేదనలో తెవాటియా, మిల్లర్ విరుచుకుపడటంతో బెంగళూరుకు ‘హ్యాట్రిక్’ పరాజయం తప్పలేదు. లీగ్‌లో 14 మ్యాచ్‌ల అనంతరం విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధించినా.. అది జట్టును గెలిపించేందుకు ఉపయోగ పడకపోవడం విచారకరం!
ముంబై: ఈ సీజన్లో ఎదురులేకుండా సాగుతున్న గుజరాత్ టైటాన్స్ మరో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం తొలి పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఐపీఎల్లో 14 మ్యాచ్‌ల అనంతరం హాఫ్‌సెంచరీ నమోదు చేయగా.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సాంగ్వాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. రాహుల్ తెవాటియా (25 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు.
బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఒక దశలో 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను తెవాటియా, మిల్లర్ ఆదుకున్నారు. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా సంయమనం పాటించిన ఈ జోడీ.. ఒక్కసారి కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడింది. ఐపీఎల్-15వ సీజన్లో గుజరాత్‌కు ఇది ఎనిమిదో విజయం కాగా.. బెంగళూరు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట నెగ్గిన గుజరాత్ 16 పాయింట్లతో పట్టిక టాప్‌లో నిలువడంతో పాటు అనధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. విధ్వంసక ఆటతో గుజరాత్‌కు విజయాన్ని కట్టబెట్టిన తెవాటియాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్‌లో ఢిల్లీతో లక్నో.. చెన్నైతో హైదరాబాద్ తలపడనున్నాయి.
కోహ్లీ ఎన్నాళ్లకెన్నాళ్లకు!
గత కొన్నాళ్లుగా టచ్ దొరక్క ఇబ్బంది పడుతున్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గుజరాత్‌పై సత్తాచాటాడు. విరాట్ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ కాకపోయినా.. కష్టకాలంలో వచ్చిన ఈ అర్ధశతకం అతడి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్లో అతడికిది 14 మ్యాచ్‌ల తర్వాత ఇదే తొలి హాఫ్‌సెంచరీ కావడం గమనార్హం. ఓపెనర్‌గా మైదానంలో అడుగుపెట్టిన విరాట్ 17వ ఓవర్ వరకు క్రీజులో నిలిచాడు. షమీ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన విరాట్.. సహచర ఓపెనర్ డుప్లెసిస్ (0) డకౌటైనా.. ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకున్నాడు. మూడో ఓవర్లో షమీకి మరో బౌండ్రీ రుచిచూపించిన కోహ్లీ.. జోసెఫ్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. ఈ జోరు చూస్తుంటే.. బెంగళూరు భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా.. ప్రదీప్ సాంగ్వాన్ రాకతో పరుగుల వేగం మందగించింది. ఫెర్గూసన్ ఓవర్లో 6,4తో గేర్ మార్చిన కోహ్లీ.. 45 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ అండతో ధాటిగా ఆడిన రజత్ కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోగా.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 170/6 (కోహ్లీ 58, రజత్ 52; ప్రదీప్ సాంగ్వాన్ 2/19),
గుజరాత్: 19.3 ఓవర్లలో 174/4 (తెవాటియా 43 నాటౌట్, మిల్లర్ 39 నాటౌట్; షాబాజ్ 2/26, హసరంగ 2/28).