ముల్లాన్‌పూర్ : ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఒకానొక దశలో అగ్రస్థానంలో నిలుస్తుందనుకున్న గుజరాత్ ఆఖర్లో వరుస మ్యాచ్‌ల్లో ఓటములతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు లీగ్ ప్రారంభంలో వరుస ఓటములతో ఈసారి నిరాశపరుస్తుందా అనుకున్న ఐదు సార్లు చాంపియన్ ముంబై అద్భుతంగా పుంజుకుంది. అయితే ఇరు జట్లలో కీలక ప్లేయర్లు వైదొలుగడంతో తుది జట్ల కూరుపై ఆసక్తి నెలకొన్నది.
ముఖ్యంగా గుజరాత్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచిన ఇంగ్లండ్ హార్డ్‌హిట్టర్ జోస్ బట్లర్ లేని లోటును భర్తీ చేయడం కష్టంగా కనిపిస్తున్నది. పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న ముంబైని ఎదుర్కొవడం గుజరాత్‌కు కష్టమే. గిల్, సుదర్శన్‌లో ఏ ఒక్కరూ విఫలమైనా గుజరాత్ కుప్పకూలడం ఖాయం. రికార్డు స్థాయిలో ఆరో టైటిల్‌పై కన్నేసిన ముంబై..గుజరాత్‌ను నాకౌట్ చేసి ముందంజ వేయాలని చూస్తున్నది. జాతీయ జట్ల తరఫున ఆడేందుకు ఇప్పటికే రికల్టన్, విల్ జాక్స్ ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లగా వారి స్థానాలను బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లిసన్, చరిత అసలంక ఏ మేరకు భర్తీ చేస్తారో చూడాలి.