IPL 2025 | భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు శిక్షణను ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తత మారిన నేపథ్యంలో ఐపీఎల్ పరిపాలన టోర్నీని వారం పాయిటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతున్న నేపథ్యంలో టోర్నీ పునః ప్రారంభంపై చర్చలు జరిగాయి. ఈ నెల 16న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానున్నంది. ఇక గుజరాత్ జట్టు ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఢిల్లీ, ముంబయి, చెన్నైతో కీలక మ్యాచులున్నాయి. ఈ మూడు మ్యాచుల్లోనూ రాణించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాలని ఆశిస్తున్నది. గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిదింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో అదే ఊపుతో మరోసారి చాంపియన్‌గా నిలువాలని భావిస్తుంది.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) ఆటగాళ్లకు మూడు గంటలకుపైగా జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్లు తెలిపింది. సస్పెన్షన్ కారణంగా సీజన్లో కొన్ని మ్యాచులకు దూరమైన కగిసో రబాడ మళ్లీ జట్టుతో చేరాడు. రూథర్‌ఫోర్డ్, మహమ్మద్ సిరాజ్, కెప్టెన్ గిల్‌తో కలిసి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 8న పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ స్టేటస్‌ని బీసీసీఐ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇరు జట్లకు ఎలాంటి పాయింట్లు కేటాయించలేదు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైతే.. మళ్లీ నిర్వహిస్తారా? లేదంటే చెరో పాయింట్‌ను కేటాయిస్తారా? అన్నది తెలియలేదు. టోర్నీని లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తోనే మొదలుపెట్టనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బీసీసీఐ మళ్లీ షెడ్యూల్‌ని సవరించిన సమయంలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.