ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్.. అనధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. వరుస విజయాలతో బెంబేలెత్తిస్తున్న హార్దిక్ పాండ్యా సేన.. 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తుచేసింది. అన్నదమ్ముల సవాల్‌గా సాగిన పోరులో అన్న కృనాల్‌పై తమ్ముడు హార్దిక్‌దే పైచేయి అయింది.
అహ్మదాబాద్: టాపార్డర్ విజృంభించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఎనిమిదో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో గుజరాత్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 12 ఓవర్లలో 142 పరుగులు జోడించి గట్టి పునాది వేయగా.. ఆ తర్వాత కూడా టైటాన్స్ అదే జోరు కొనసాగించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (25; ఒక ఫోర్, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడారు.
లక్నో బౌలర్లలో అవేశ్, మొహసిన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు కైల్ మయేర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), క్వింటన్ డికాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడారు. వీరిద్దరూ మినహా తక్కినవాళ్లంతా విఫలమవడంతో లక్నోకు పరాజయం తప్పలేదు. దీపక్ హుడా (11), మార్కస్ స్టొయినిస్ (4), నికోలస్ పూరన్ (3), ఆయుష్ బదోనీ (21) పెవిలియన్‌కు వరుస కట్టారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 4 వికెట్లు పడగొట్టాడు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 227/2 (గిల్ 94 నాటౌట్, సాహా 81; అవేశ్ 1/34),
లక్నో: 71/7 (డికాక్ 70, మయేర్స్ 48; మోహిత్ 4/29)