అహ్మదాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు వచ్చే సీజన్ నుంచి కొత్త యాజమాన్యం రానుంది. ప్రస్తుతం టైటాన్స్‌లో అత్యధిక వాటా కలిగిన సీవీసీ క్యాపిటల్స్ వద్ద ఉన్న 67 శాతం వాటాలను అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ టొరెంట్ గ్రూప్ కొన్నట్టు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఒప్పందం ఇరు వర్గాల మధ్య ఇప్పటికే పూర్తవగా ఐపీఎల్ పాలక మండలి దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం వచ్చే సీజన్లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు కొత్త యాజమాన్యం మార్గదర్శకత్వంలో బరిలోకి దిగుతుంది. 2021లోనే టొరెంట్ గ్రూప్.. గుజరాత్ ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి 2021లో బిడ్ కూడా వేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోనూ జట్టు కోసం యత్నించినా ఆ సంస్థకు అప్పుడు నిరాశే ఎదురైనా ఇప్పుడు ఐపీఎల్లో టైటాన్స్ ఓనర్స్ కానుంది.