అహ్మదాబాద్: ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు గెలుస్తూ తర్వాతి మ్యాచ్ ఓడుతున్న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. వరుసగా రెండు విజయాల అనంతరం ఆ జట్టు.. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజన్లో మూడో పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదట బంతితో తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోయిన టైటాన్స్.. ప్రత్యర్థి నిర్దేశించిన 156 పరుగుల స్వల్ప ఛేదనను జీటీ.. 15.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (18 బంతుల్లో 43, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. తొలుత ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు.. బ్యాటర్ల వైఫల్యంతో 19.2 ఓవర్లలో 155 రన్స్‌కే చేతులెత్తేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 28, 5 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జీటీ బౌలర్లలో అర్షద్ (3/22) మూడు వికెట్లు తీయగా రషీద్ (2/19), హోల్డర్ (2/29) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అహ్మదాబాద్‌లో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే ఆడే జీటీ సారథి గిల్.. స్వల్ప ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడటంతో టైటాన్స్ జోరు కనబరిచింది. భువీ తొలి ఓవర్లోనే 4, 6తో వేట మొదలెట్టిన గిల్.. హాజిల్‌వుడ్ రెండో ఓవర్లో అయితే విశ్వరూపం చూపించాడు. 4, 4, 6, 4, 6తో ఆ ఓవర్లో 24 రన్స్ పిండుకున్నాడు. అయితే భువీ వరుస ఓవర్లలో సాయి సుదర్శన్ (6)తో పాటు గిల్‌నూ ఔట్ చేసి టైటాన్స్‌కు డబుల్ షాకులిచ్చాడు. ఈ దశలో బట్లర్ అందుకుని బాదుడు బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. హాజిల్‌వుడ్ ఓవర్లో బౌండరీ, సిక్స్ సాధించిన అతడు.. సుయాశ్ బౌలింగ్‌లో రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.
అయితే స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తర్వాత భువీ మరోసారి జీటీకి షాకిచ్చాడు. లెగ్స్టంప్నకు గురిపెట్టి అతడు విసిరిన బంతిని పక్కకు జరిగి ఆడబోయిన బట్లర్ క్లీన్‌బౌల్డ్ అవడంతో టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. షెఫర్డ్ 11వ ఓవర్లో షారుఖ్ ఖాన్ (8), వాషింగ్టన్ సుందర్ (12)ను ఔట్ చేసి ఆ జట్టును ఒత్తిడిలోని నెట్టే యత్నం చేశాడు. కానీ సిరాజ్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన రాహుల్ తెవాటియా (17 బంతుల్లో 27*, 4 ఫోర్లు) బెంగళూరుకు ఆ అవకాశమివ్వలేదు. హోల్డర్ (12), రషీద్ (7*) అండతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించినా 8 ఓవర్ల తర్వాత తడబాటుకు గురై ప్రత్యర్థి బౌలర్లకు దాసోహమైంది. పవర్ ప్లే అనంతరం 78/2తో పటిష్టంగానే కనిపించిన ఆ జట్టు.. 4 ఓవర్ల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. రబాడా రెండో ఓవర్లో కోహ్లీ వరుసగా ఐదు బౌండరీలతో జోరు చూపించినా సిరాజ్ తన సెకండ్ ఓవర్లో బెతెల్ (5)ను ఔట్ చేసి వికెట్ల బోణీ కొట్టాడు.
ఆ వెంటనే రబాడా విసిరిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లీ.. భారీ షాట్ ఆడబోయి మిడ్ వికెట్ వద్ద రషీద్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ఈ దశలో పడిక్కల్, కెప్టెన్న రజత్ దూకుడుగా ఆడారు. సిరాజ్ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన పడిక్కల్.. హోల్డర్ ఓవర్లోనూ బంతిని రెండుసార్లు బౌండరీ లైన్ దాటించాడు. అయితే అర్షద్, రషీద్ రాకతో బెంగళూరు ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అర్షద్ వేసిన 8వ ఓవర్లో నాలుగో బంతిని పుల్ చేయబోయిన బెంగళూరు సారథి.. స్కేర్ లెగ్ వద్ద హోల్డర్ సూపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఇక అక్కడ్నుంచి ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి తప్పింది.
హోల్డర్ బౌలింగ్‌లో జితేశ్ (1) కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇవ్వగా ప్రమాదకర టిమ్ డేవిడ్ (9)ను రషీద్ బోల్తా కొట్టించాడు. అర్షద్ కూడా 11వ ఓవర్లో కృనాల్ (4) కథ ముగించడంతో బెంగళూరు ఆరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సహచరులంతా పెవిలియన్ చేరుతుండటంతో పడిక్కల్ సైతం వికెట్ కాపాడుకునేందుకే యత్నించడంతో స్కోరువేగం నెమ్మదించింది. 14వ ఓవర్లో అతడిని రషీద్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లినైట్టెంది. ఆఖర్లో షెపర్డ్ (17), ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (12) పెద్దగా బ్యాట్ ఝుళిపించకుండానే వెనుదిరిగారు.