ముంబై: ఈ సీజన్లో వరుసగా ఆరు విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహాతంగా సాగుతున్న ఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్(జీటీ) కళ్లెం వేసింది. ఈ సీజన్లో వరుసగా ఏడో విజయంతో తిరిగి అగ్రస్థానంతో పాటు ప్లేఆఫ్స్ బెర్తునూ ఖాయం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని గుజరాత్ ఓడించి షాకిచ్చింది. మంగళవారం రాత్రి వాంఖడే వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై 3 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్) జీటీ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత ఓవర్లలో 155/8కే పరిమితమైంది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ (2/34), గెరాల్డ్ కొయెట్జ్ (1/10), అర్షద్ ఖాన్ (1/18), రషీద్ ఖాన్ (1/21), సిరాజ్ (1/29) సమిష్టిగా సత్తాచాటారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 19 ఓవర్లలో 147/7 స్కోరు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(43), బట్లర్(30) రాణించారు. బుమ్రా (2/19), బౌల్ట్(2/22) ఆకట్టుకున్నారు. వర్షం అంతరాయంతో డకవర్త్ లూయిస్ ప్రకారం గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా, కొట్జె(12) ఔటైనా..తెవాటియా(11 నాటౌట్), అర్షద్‌ఖాన్(1 నాటౌట్) జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు.
జీటీ నిలకడగా:
స్వల్ప ఛేదనలో టైటాన్స్కూ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ (5)ను బౌల్ట్ రెండో ఓవర్లోనే ఔట్ చేసి ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఐపీఎల్లో ఈ తమిళనాడు కుర్రాడు సింగిల్ డిజిట్‌కు వెనుదిరగడం ఇది మూడోసారి మాత్రమే. బుమ్రా, బౌల్ట్ కట్టుదిట్టంగా బంతులేయడంతో టైటాన్స్‌కు పరుగుల రాకే గగనమైంది. పవర్ ప్లేలో గుజరాత్ చేసిన స్కోరు 29/1 మాత్రమే. కానీ 8వ ఓవర్ వేసిన హార్దిక్.. 11 బంతులు (3 వైడ్స్, 2 నోబాల్స్) విసిరి 18 పరుగులు సమర్పించుకోవడంతో టైటాన్స్ మళ్లీ రేసులోకి వచ్చింది. అశ్వని ఓవర్లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ జారవిడిచినా.. మరుసటి బంతికే బ్యాట్ ఎడ్జ్‌కు తాకి రికెల్టన్ చేతిలో పడటంతో అతడు నిష్క్రమించాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రూథర్‌ఫర్డ్.. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. జాక్స్ ఓవర్లో 4, 4, 6తో సమీకరణాలు మారిపోయాయి. టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బెదిరించిన వర్షం.. 14వ ఓవర్లో జోరందుకుంది. కానీ అప్పటికే డీఎల్ఎస్ కంటే 8 రన్స్ అధికంగా ఉన్న గుజరాత్‌ను రూథర్‌ఫర్డ్ ఆదుకున్నాడు. అయితే వర్షం అంతరాయం తర్వాత గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గిల్ క్లీన్‌బౌల్డ్ కాగా, రూథర్‌ఫర్డ్‌ను బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వీరిద్దరు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన షారుఖ్‌ఖాన్(5), రషీద్‌ఖాన్(2) వెంటవెంటనే ఔట్ కావడంతో సమీకరణం కాస్తా 12 బంతుల్లో 24 పరుగులకు మారింది. ఈ తరుణంలో మరోమారు భారీ వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కల్గింది.
ఆ ఇద్దరి దూకుడుతో..
గత మ్యాచ్‌లలో ముంబైకి మెరుపు ఆరంభాలను అందించిన ముంబై ఓపెనర్లు రికెల్టన్ (2), రోహిత్ (7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టుకు మొదట్లోనే షాకులు తాకాయి. సిరాజ్ రెండో బంతికే రికెల్టన్ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో సుదర్శన్ అందుకోగా లెఫ్టార్స్ పేసర్లను ఆడటంలో తంటాలుపడే రోహిత్.. మరోసారి అదే బలహీనతను చాటుతూ అర్షద్ నాలుగో ఓవర్లో మిడాఫ్ వద్ద ప్రసిద్ధ్ చేతికి చిక్కాడు. ఎదుర్కున్న రెండో బంతికే సుదర్శన్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన జాక్స్‌కు సూర్య జతకలవడంతో ముంబై స్కోరువేగం పుంజుకుంది. సిరాజ్ మూడో ఓవర్లో జాక్స్ 6,4 కొట్టగా.. ప్రసిద్ధ్ 5వ ఓవర్లో సూర్య మూడు బౌండరీలు రాబట్టాడు. అర్షద్ ఆరో ఓవర్లో జాక్స్ కూడా మూడు ఫోర్లు బాదాడు. ఈ ద్వయం దూకుడుతో పది ఓవర్లకు ముంబై 89/2తో పటిష్టంగానే నిలిచింది. సాయి కిషోర్ 11వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టిన జాక్స్ అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. కానీ ఇదే ఓవర్లో సూర్య.. భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో షారుక్‌కు క్యాచ్ ఇవ్వడంతో 71 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సూర్య నిష్క్రమణతో ముంబై ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. రషీద్.. జాక్స్‌ను బోల్తా కొట్టించగా మరుసటి ఓవర్లో సాయి.. హార్దిక్‌ను ఔట్ చేయడంతో ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన కొయెట్జ్.. తిలక్ (7)ను పెవిలియన్‌కు పంపాడు. నమన్ (7) సైతం నిరాశపరచగా ఆఖర్లో కార్బిన్ బాష్ (27) మెరుపులతో ముంబై పోరాడగలిగే స్కోరును సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 155/8 (జాక్స్ 53, సూర్య 35, సాయి కిషోర్ 2/34, కొయెట్జ్ 1/10); గుజరాత్: 19 ఓవర్లలో 147/7(గిల్ 43, బట్లర్ 30, బుమ్రా 2/19, బౌల్ట్ 2/22)