Gujarat Titans | ఆరంభ సీజన్లో విజేత.. రెండో సీజన్లో రన్నరప్.. ఐపీఎల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన దిగ్గజ జట్లకు కూడా సాధ్యం కాని విధంగా అరంగేట్రంలోనే సంచలనాలు నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్.. నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిలపడ్డ శుభ్‌మన్ గిల్ సేన.. ఈసారి మాత్రం పట్టు విడవకూడదని భావిస్తోంది. మరి సమిష్టితత్వానికి పర్యాయపదంగా నిలిచిన గుజరాత్.. మళ్లీ గాడిన పడుతుందా?
నమస్తే తెలంగాణ క్రీడా : మూడేండ్ల క్రితం ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆరంభమే పెను సంచలనం. 18 ఏండ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు సాధ్యం కాని ట్రోఫీని టైటాన్స్ ఆరంభ సీజన్లో అందుకుంది. సమిష్టిగా ఆడి హేమాహేమి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తూ తొలి సీజన్ (2022)లోనే టైటిల్ పట్టేసింది. రెండో సీజన్లోనూ ఫైనల్ చేరిన టైటాన్స్.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నా ఆ సీజన్లోనూ వరుస విజయాలతో సత్తా చాటింది. కానీ తొలి రెండు సీజన్లు టైటాన్స్‌ను నడిపించిన హార్దిక్ పాండ్యా తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో గుజరాత్.. గత సీజన్లో సాదా సీదా జట్టుగా మిగిలిపోయి 8వ స్థానంతో ముగించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన ఆ జట్టు.. 2025లో మాత్రం మళ్లీ గర్జించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వేలంలో భారీ మొత్తం వెచ్చించి నాణ్యమైన క్రికెటర్లను సొంతం చేసుకుని టైటిల్ వేటకు సిద్ధమైంది.
మెగావేలంలో గుజరాత్.. రాజస్థాన్ రాయల్స్ మాజీ ఓపెనర్ జోస్ బట్లర్ (రూ. 15.75 కోట్లు)తో పాటు మొన్నటి సీజన్ వరకూ బెంగళూరు ఆస్థాన బౌలర్ అయిన మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు), ప్రసిధ్ కృష్ణ (రూ. 9.5 కోట్లు), కగిసొ రబాడా(రూ. 9.5 కోట్లు)ను భారీ ధరకు కొనుగోలు చేసింది. వీరితో పాటు సఫారీ పేసర్ గెరాల్డ్ కొయెట్జ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆల్‌రౌండర్ల చేరికతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.
టైటాన్స్‌కు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. 2022 సీజన్లో 863 పరుగులతో విజృంభించిన బట్లర్.. గత రెండు సీజన్లలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా టీ20లలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. ఇక 2023లో 890 పరుగులతో రెచ్చిపోయిన గిల్.. గత సీజన్లో తేలిపోయాడు. కెప్టెన్‌గా సైతం గిల్ విఫలమవడంతో ఆ ప్రభావం అతడి అంతర్జాతీయ కెరీర్‌పై పడింది. నిరుడు భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతడు లేడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే జట్టు పగ్గాలు గిల్‌కు దక్కుతాయని భావించినా అందుకు బీసీసీఐ మరింత స్పష్టతకు రావాలంటే గుజరాత్ సారథి ఈ సీజన్లో బ్యాట్‌తో పాటు సారథిగానూ నిరూపించుకోవాలి.
అదీగాక కేవలం అహ్మదాబాద్‌లోనే ఆడతాడన్న ముద్రను చెరిపేసి అన్ని వేదికల్లో సత్తా చాటేలా గిల్ ఏ మేరకు విజయవంతమవుతాడన్నది త్వరలోనే తేలనుంది. గిల్‌తో పాటు బట్లర్ కెరీర్‌కూ ఈ సీజన్ కీలకం. చాంపియన్స్ ట్రోఫీ వైఫల్యంతో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల పగ్గాలను వదిలేసిన బట్లర్.. జట్టులో కొనసాగాలంటే 2025లో బ్యాట్ ఝులిపించాల్సిందే. రాబోయే సీజన్లో ఈ ఇద్దరూ గుజరాత్‌కు ఓపెనర్లుగా వచ్చే అవకాశముంది. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్‌నకు ఎంతో కీలకం. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో తనదైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలతో అలరిస్తున్న ఫిలిప్స్‌ను గుజరాత్ పూర్తిస్థాయిలో వాడుకునే అవకాశముంది.
బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా బౌలింగ్‌లో గుజరాత్ ఈ సీజన్లో కీలక బౌలర్లను వదులుకోవడం ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించే అవకాశముంది. గత మూడు సీజన్లలో షమీ, మోహిత్ శర్మ ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించినా ఇప్పుడు ఆ ఇద్దరూ దూరమయ్యారు. ఈ సీజన్లో రబాడా చేరడం గుజరాత్‌కు లాభించేదే అయినా భారీగా పరుగులిచ్చుకునే సిరాజ్, ఫిట్నెస్ సమస్యలతో సతమతమయ్యే ప్రసిధ్ కృష్ణ ఏ మేరకు రాణిస్తారనేది కీలకం. గత సీజన్లో రషీద్ ఖాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా 2025లో గుజరాత్ అతడిపై భారీ ఆశలే పెట్టుకుంది. సాయి కిశోర్ అండగా రశీద్ స్పిన్ మాయ చేస్తే ప్రత్యర్థులకు తిప్పలు తప్పవు. పొట్టి నిక్కరు, తలకు బ్యాక్ క్యాప్ పెట్టుకుని ఓ చేతిలో కొబ్బరి బొండం, మరో చేతిలో పెన్ను పేపరుతో లెక్కలేసుకుంటూ కూల్‌గా కనిపించే హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా.. టైటాన్స్‌కు మళ్లీ ట్రోఫీని అందిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం.