IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో విదేశీ ఆటగాళ్లు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ భారత్‌కు వచ్చినా లీగ్ దశ మ్యాచ్‌లు ఆడి మళ్లీ స్వదేశం వెళ్లిపోతారు. దాంతో, ప్లే ఆఫ్స్ కోసం కొత్తవాళ్లను తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పలు జట్లు బ్యాకప్ ప్లేయర్లపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఫ్రాంచైజీ గురువారం కుశాల్ మెండిస్ (Kusal Mendis)తో ఒప్పందం చేసుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ స్థానంలో మెండిస్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నట్టు గుజరాత్ యాజమాన్యం వెల్లడించింది.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఈ సీజన్ కోసం మయాంక్‌ను రూ.11 కోట్లకు అట్టిపెట్టుకుంది లక్నో. అయితే.. గాయం నుంచి కోలుకొని జట్టుతో కలిసిన ఈ పేస్ గన్.. మునపటిలా వికెట్ల వేట కొనసాగించలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ సైతం టోర్నీ నుంచి నిష్క్రమించిన లాకీ ఫెర్గూసన్ స్థానంలో కైలీ జేమీసన్ (Kyle Jameison)ను తీసుకుంది.
ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశం వెళ్లిన బట్లర్ లీగ్ మ్యాచ్‌ల కోసం భారత్ వస్తున్నాడు. అయితే.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ఉన్నందున అతడు ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నాడు. కాబట్టి.. అతడి బదులు కుశాల్ మెండిస్‌ను ఆడించేందుకు గుజరాత్ సిద్దమైంది. ఇప్పటివరకూ ఐపీఎల్ ఆడని మెండిస్.. టీ20ల్లో మాత్రం మంచి రికార్డు ఉంది.
ఇప్పటివరకూ 167 ఇన్నింగ్స్‌ల్లో 137.43 స్ట్రయిక్ రేటుతో పరుగులు సాధించాడీ హిట్టర్. సో.. అతడితో రూ.75 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది గుజరాత్ యాజమాన్యం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ మే 18న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
కోహ్లీ, జేమీసన్
న్యూజిలాండ్ పేసర్ జేమీసన్ మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. గాయపడిన ఫెర్గూసన్ స్థానంలో అతడిని రూ.2 కోట్లకు తీసుకుంది పంజాబ్ కింగ్స్. 2021లో ఆర్సీబీ ఈ కివీస్ ఆల్‌రౌండర్‌ను రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే.. అప్పుడు ఈ పొడగరి పేసర్ 9 మ్యాచ్‌లు ఆడాడంతే. ఆ తర్వాత 2023లో జేమీసన్‌ను సీఎస్కే రూ.1 కోటికి దక్కించుకుంది. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. టీ20ల్లో జేమీసన్ ఇప్పటివరకూ 94 వికెట్లు పడగొట్టాడు.