వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ అదరగొట్టింది. ఆదివారం వడోదర వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్.. 6 వికెట్ల తేడాతో యూపీని ఓడించి మూడో సీజన్లో టైటిల్ వేటను షురూ చేసింది. యూపీ నిర్దేశించిన 144 పరుగుల ఛేదనను గుజరాత్.. 18 ఓవర్లలోనే పూర్తిచేసింది. ఆ జట్టు సారథి ఆష్లే గార్డ్నర్ (32 బంతుల్లో 52, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. హర్లీన్ (34 నాటౌట్), డాటిన్ (33 నాటౌట్) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన యూపీని కెప్టెన్ దీప్తి శర్మ (39), ఉమా ఛెత్రి (24) ఆదుకున్నారు. గుజరాత్ స్పిన్నర్ ప్రియా మిశ్రా (3/25) ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసింది.
గార్డ్నర్ జోరు
స్వల్ప ఛేదనే అయినా విజయం కోసం గుజరాత్ చెమటోడ్చక తప్పలేదు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై యూపీ స్పిన్నర్లు తొలి రెండు ఓవర్లలోనే మూనీ, హేమలతను పెవిలియన్‌కు పంపి జెయింట్స్‌పై ఒత్తిడి తెచ్చారు. అయితే లారా వోల్వార్ట్ (22)తో కలిసిన గార్డ్నర్.. గుజరాత్ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చింది. క్రాంతి 3వ ఓవర్లో రెండు బౌండరీలతో వేట మొదలెట్టిన ఆమె సైమా 5వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టింది. ఎకిల్‌స్టోన్ 9వ ఓవర్లో లారా నిష్క్రమించినా గార్డ్నర్ దూకుడును ఆపలేదు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన ఆమెను మెక్‌గ్రాత్ ఔట్ చేసింది. ఆష్లే నిష్క్రమించినా డాటిన్, హర్లీన్ మరో వికెట్ పడకుండా ఛేదనను పూర్తిచేశారు.
ప్రియా మాయ
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 22 పరుగులకే రెండు కోల్పోయినా ఉమా, దీప్తి ఆ జట్టును ఆదుకున్నారు. ఈ ద్వయం మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో ఒక దశలో యూపీ 72/2తో పటిష్టంగానే కనిపించింది. కానీ ప్రియా మాయతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. డాటిన్ బౌలింగ్‌లో ఉమ క్యాచ్ అందుకున్న ప్రియా.. ఆ తర్వాత దీప్తి, మెక్‌గ్రాత్, హరీస్‌ను ఔట్ చేసి యూపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఆఖర్లో శ్వేత (16), అలానా (19), సైమా (15) మెరుపులతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. గార్డ్నర్ (2/39) బౌలింగ్‌లోనూ రాణించింది.
సంక్షిప్త స్కోర్లు:
యూపీ: 20 ఓవర్లలో 143/9 (దీప్తి 39, ఉమ 24, ప్రియా 3/25, డాటిన్ 2/34); గుజరాత్: 18 ఓవర్లలో 144/4 (గార్డ్నర్ 52, హర్లీన్ 34 నాటౌట్, ఎకిల్‌స్టోన్ 2/16)