వడోదరా: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను అలరించింది. చివరి బంతి వరకు ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్‌దే పైచేయి అయ్యింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 3 పరుగుల తేడాతో ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది.
తద్వారా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. మరోవైపు గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో ఢిల్లీ..మరోమారు గుజరాత్‌కు తలవంచింది. 175 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో బౌలింగ్‌కు దిగిన సోఫీ డివైన్(4/37)..అద్భుతం చేసింది. చివరి మూడు బంతుల్లో అప్పటికే క్రీజులో కుదురుకుని జోరుమీదున్న స్నేహ్‌రానా(29)తో పాటు నిఖిప్రసాద్(47)ను ఔట్ చేసి గుజరాత్‌ను గెలుపు సంబురాల్లో నిలిపింది. రాజేశ్వరి గైక్వాడ్ (3/20) ఆకట్టుకుంది. తొలుత బేత్ మూనీ (58), అనుశ్కశర్మ(39) రాణించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 174/9 స్కోరు చేసింది. శ్రీచరణి (4/31) నాలుగు వికెట్లు తీసింది.