ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) అవుటయ్యాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెమ్మదైన ఆటతీరు కనబరిచిన కోహ్లీ.. ఆచితూచి ఆడుతూ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఆటగాడు రజత్ పటీదార్ (52) అవుటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో గేరు మార్చి ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షమీ వేసిన యార్కర్‌ను ఆఫ్‌సైడ్ ఆడేందుకు ట్రై చేసిన కోహ్లీ.. పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆ తర్వాత కాసేపటికే దినేష్ కార్తీక్ (2) కూడా అవుటయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన డీకే.. షార్ట్ ఫైన్ లెగ్‌లో మహమ్మద్ షమీకి సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో బెంగళూరు జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. బెంగళూరు బలమైన స్కోరు చేయాలంటే ఆ భారం మొత్తం మ్యాక్స్‌వెల్ మీదనే ఉంది.