ఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా సంస్కరణలు భారత క్రికెట్ అభిమానులకు షాకిచ్చాయి. ప్రస్తుతమున్న 12%, 28% స్లాబులను ఎత్తేసి వాటి స్థానంలో రెండు (5, 18 శాతం) స్లాబ్స్‌ను మాత్రమే ఉంచిన కేంద్రం.. లగ్జరీ వస్తువులు, క్యాసినోలు, రేసింగ్ లీగ్‌లు, పొగాకు వంటి వాటిని 40 శాతం స్లాబులోకి చేర్చాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ లీగ్స్‌లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టికెట్లు లగ్జరీ గూడ్స్ స్లాబు కిందకే వచ్చాయి. దీంతో ఇక నుంచి ఈ లీగ్ టికెట్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి.
2025 సీజన్ దాకా ఐపీఎల్ టికెట్ రేట్లు 28 శాతం స్లాబు కింద ఉండగా వచ్చే సీజన్ నుంచి అవి 40 శాతానికి చేరతాయి. ఉదాహరణకు గత సీజన్ వరకూ ఒక టికెట్ ధర రూ. 1000 ఉంటే దానికి జీఎస్టీతో కలుపుకుని ప్రేక్షకుడు రూ. 1,280 చెల్లించాల్సి (28 శాతం జీఎస్టీతో) వచ్చేది. కానీ ఇప్పుడు అది కాస్తా రూ. 1,400 (40 శాతం జీఎస్టీ) కానుంది. అంటే గతంతో పోల్చితే మరో రూ. 120 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ఐపీఎల్‌కు మాత్రమే వర్తించనుంది.
భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రం టికెట్ రేట్లు జీఎస్టీ 18 శాతం కిందకే వస్తాయి. రూ. 500 కంటే ఎక్కువ ధర కలిగిన టికెట్లపై 18 శాతం జీఎస్టీ వర్తించనుంది. కనీసం రూ. 500 కంటే తక్కువ ధర కల్గిన టికెట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇదిలా ఉండగా ఐపీఎల్లో టికెట్ రేట్లు పెరిగితే ఈ లీగ్‌కు ఆదరణ గత సీజన్ల మాదిరిగానే ఉంటుందా? లేదా? అన్న విశ్లేషణలు ఇప్పుడే ఊపందుకున్నాయి. ఐపీఎల్లో టికెట్ రేట్ల నియంత్రణ బీసీసీఐ చేతిలో ఉండదు. ఫ్రాంచైజీలే వాటిని నిర్ణయిస్తాయి. మరి పెరుగనున్న టికెట్ రేట్లను ఫ్రాంచైజీలు తగ్గించి క్రీడాభిమానులకు ఉపశమనం కల్గిస్తాయా? లేదా? అన్నది చూడాలి.