హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్న గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తున్నది. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో 24 వేర్వేరు స్పోర్ట్స్ అకాడమీలు నడుస్తున్నాయి. ఇందులో నుంచి ఇప్పటి వరకు ఏడుగురు అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో రాణించారు. జాతీయ స్థాయిలో 107 స్వర్ణాలు, 14 రజతాలు, 27 కాంస్య పతకాలు, రాష్ట్ర స్థాయిలో 344 స్వర్ణాలు, 234 రజతాలు, 176 కాంస్య పతకాలు సాధించారు. క్రీడల్లో ప్రతిభ చాటుతూ పతకాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో రూ.21.33 లక్షలు, 2018-19లో రూ.33.38 లక్షలు, 2020-21లో రూ.12.85 లక్షలు అందజేసింది. దీంతో పాటు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతీ రోజు పౌష్టిక ఆహారం కోసం రూ.125 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీకి ముగ్గురు:
ఈనెల 14 నుంచి నార్మండీ(ఫ్రాన్స్) వేదికగా జరిగే వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీకి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు మాయావతి, ప్రణయ్, రవికిరణ్ బరిలో దిగుతున్నారు. దిండి అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన మాయావతి 100 మీటర్ల రేసులో, పారా అథ్లెట్ రవికిరణ్ 100 మీటర్లతో పాటు జావెలిన్‌త్రోలో, ప్రణయ్ ట్రిపుల్ జంప్‌లో పోటీపడుతున్నారు. కజకిస్థాన్‌లో జరిగే ఏషియా అండర్-20 వాలీబాల్ టోర్నీలో లావణ్య బరిలోకి దిగుతున్నది. వీరిని మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి రొనాల్డ్‌రాస్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించి తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు.