హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. చైనా వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో సెపక్తక్రా గేమ్‌కు టెక్నికల్ అధికారిగా ఎంపికైన ప్రేమ్‌రాజ్‌ను బుధవారం సచివాలయంలో మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో హైదరాబాద్ వేదికగా ప్రపంచ సెపక్తక్రా చాంపియన్‌షిప్ ఘనంగా నిర్వహించాం. ఆసియాగేమ్స్‌కు ప్రేమ్‌రాజ్ టెక్నికల్ అఫీషయల్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. 2025లో జరిగే ప్రపంచ సెపక్తక్రా టోర్నీకి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని ఆసియా ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్దుల్ హలీం.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు.