Gongadi Trishaకౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష తన ఆరాధ్య ప్లేయర్ మిథాలీరాజ్ అడుగుజాడల్లో నడుస్తున్నానని పేర్కొంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన త్రిష ఈ రికార్డు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో త్రిష మాట్లాడుతూ..
‘భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ను చూస్తూ పెరిగాను. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఆమె నుంచి నేర్చుకున్నాను. మిథాలీ ఎప్పటికీ ఆరాధ్య ప్లేయర్. స్కాట్లాండ్పై సెంచరీ చాలా ప్రత్యేకం. వాస్తవానికి ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయాలనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. తొలుత బ్యాటింగ్ చేయడం కలిసొచ్చింది. సహచరులు సంబరాలు చేసే వరకు తెలియదు సెంచరీ మార్క్ చేరుకున్నానని. ఈ స్థాయికి చేరుకోవడానికి నా తల్లిదండ్రులు కారణం. ముఖ్యంగా నా వెన్నంటి ఉండే నాన్నకు ఈ సెంచరీ అంకితమిస్తున్నాను’అని త్రిష పేర్కొంది