భారత్, ఆస్ట్రేలియా భారీ స్కోరింగ్ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. సిరీస్‌లో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో కంగారూలు కదంతొక్కారు. టీమ్ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తూ సిరీస్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సహచరులు విఫలమైన చోట తానెంత ప్రమాదకారో మరోమారు చేతల్లో చూపిస్తూ మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. గెలుపు ఆశలు సన్నగిల్లిన వేళ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. భారత బౌలర్లను ఉతికి ఆరేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలుత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(123) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వీరవిహారం చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియాకు భారీ స్కోరు కట్టబెట్టడంలో కీలకమయ్యాడు.
గువాహటి: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా పోటీలోకి వచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే క్లిష్టమైన పరిస్థితుల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలున్న సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. మొదట రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 123నాటౌట్, 13ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో అదరగొట్టడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 222/3 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్(39), తిలక్‌వర్మ(31 నాటౌట్) ఆకట్టుకున్నారు.
రిచర్డ్సన్, బెహెన్‌డార్ఫ్, హార్డీ ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 225/5 స్కోరు చేసింది. డాషింగ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్, 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) సునామీలా విరుచుకుపడ్డాడు. ట్రావిస్ హెడ్ (35), కెప్టెన్ వేడ్ (28 నాటౌట్)రాణించారు. జట్టు గెలుపు ఆశలు వదులుకున్న వేళ మ్యాక్స్‌వెల్ మ్యాచ్ గతినే మార్చేశాడు. విధ్వంసక షాట్లతో చెలరేగుతూ పరుగులు కొల్లగొట్టాడు. బిష్ణోయ్(2/32) రెండు వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆసీస్ హార్డ్‌హిట్టర్ మ్యాక్స్‌వెల్ ఊచకోత కోశాడు. అనుభవం లేని భారత బౌలింగ్ దాడిని తుత్తునియలు చేస్తూ ఆసీస్‌కు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. నిర్దేశిత 223 పరుగుల లక్ష్యఛేదనలో ఆరో ఓవర్లో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ తుఫాన్ ముందు ప్రశాంతతలా సింగిల్స్ తీస్తూ ఆ తర్వాత సునామీలా విరుచుకుపడ్డాడు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తుండటం, ఛేదించాల్సిన లక్ష్యం అంతకంతకూ పెద్దగా ఉన్నా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మొండిగా ముందుకుసాగాడు. విజయానికి ఆరు బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో 6, 4, 4 కొట్టి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున ఫించ్, ఇంగ్లిస్(47 బంతుల్లో)తో కలిసి వేగవంతమైన సెంచరీ రికార్డు దక్కించుకున్నాడు. 4
4 అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్‌వెల్ సెంచరీలు. రోహిత్‌శర్మ(4)తో కలిసి సమంగా కొనసాగుతున్నాడు.
భారత్ 222/3
ఆస్ట్రేలియా 225/5
మొత్తం 447 పరుగులు
భారత్: 20 ఓవర్లలో 222/3(రుతురాజ్ 123 నాటౌట్, సూర్యకుమార్ 39, బెహెన్‌డార్ఫ్ 1/12, రిచర్డ్సన్ 1/34),
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 225/5(మ్యాక్స్‌వెల్ 104 నాటౌట్, హెడ్ 35, బిష్ణోయ్ 2/32, అక్షర్‌పటేల్ 1/37)