IND vs ENG : కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మాంచెస్టర్ టెస్టులోనూ శతకంతో కదం తొక్కాడు. నాలుగో రోజు నుంచి ఓపికగా క్రీజులో నిలిచిన అతడు.. ఐదో రోజు తొలి సెషన్లో సెంచరీ సాధించాడు. క్రిస్ వోక్స్ ఓవర్లో డబుల్స్.. ఆ తర్వాత సింగిల్ తీసి ఈ సిరీస్‌లో నాలుగోసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు గిల్. కేఎల్ రాహుల్ ఔటయ్యాక వాషింగ్టన్ సుందర్(10)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సారథి.. జట్టు స్కోర్ 200 దాటించాడు. ఇంకా ఇండియా 101 రన్స్ వెనకబడే ఉంది.
తద్వారా ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలతో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డు సమం చేశాడీ హిట్టర్. కెప్టెన్‌గా బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్ ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు బాదారు. ఆ తర్వాత ఎందరో గొప్ప ఆటగాళ్లు వచ్చినా.. గిల్ తరహా విధ్వంసంతో ఈ అరుదైన క్లబ్లో చోటు సంపాదించలేకపోయారు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. గవాస్కర్, విరాట్ కోహ్లీ, యశస్వీలు అతడి కంటే ముందు ఈ ఘనత సొంతం చేసుకున్నారు.
బర్మింగ్హమ్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కి సంచలనం సృష్టించిన గిల్.. మరో రికార్డు నెలకొల్పాడు. మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడుతున్న సారథి.. 700 రన్స్‌తో చరిత్రకెక్కాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక రన్స్ కొట్టిన మొట్ట మొదటి భారత కెప్టెన్‌గా గిల్ అవతరించాడు. ఆటగాడిగా చూస్తే.. ఈ ఘనత సాధించినా నాలుగో ఇండియన్‌గా రికార్డు తన పేరిట రాసుకున్నాడీ యువ నాయకుడు.
మాంచెస్టర్ టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకునే పనిలో పడిన గిల్ అర్ధ శతకంతో రాణించాడు. ఈ సిరీస్‌లో 700 పరుగులకు చేరువైన అతడు.. లెజెండ్ సునీల్ గవాస్కర్ రికార్డు బద్ధలు కొట్టాడు. ఇక కెప్టెన్‌గా ఏడొందలకు పైగా రన్స్ చేసిన దిగ్గజాల సరసన నిలిచాడు గిల్. అతడి కంటే ముందు డాన్ బ్రాడ్‌మన్ గ్యారీఫీల్డ్ సోబర్స్, గ్రెగ్ ఛాపెల్, డేవిడ్ గోవర్, గ్రాహమ్ గూచ్, గ్రేమ్ స్మిత్‌లు ఈ మైలురాయిని సాధించారు.