Sunil Gavaskar : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడెంత పాపులరో తెలిసిందే. టీ20 రాతను మార్చేసిన ఈ లీగ్ మరో సీజన్‌కు సిద్ధమవుతుంది. అంతకంటే ముందే మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ పుణ్యమాని ఎందరో యువ క్రికెటర్లు కోటీశ్వరులు అయ్యారు. జాతీయ జట్టుకు ఆడాలనే తమ కలను నిజం చేసుకున్నారు కూడా. అయితే.. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాత్రం ఐపీఎల్ రాకతో దేశవాళీ క్రికెట్ మసకబారుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
‘ఐపీఎల్ ఎప్పుడంట మొదలైందో.. అప్పటి నుంచి భారత్‌లో రంజీ ట్రోఫీ కళ తప్పింది. భారత్ మాదిరిగా మరే దేశం కూడా తమ దేశవాళీ క్రికెట్‌ను చేజేతులా నాశనం చేసుకోదు. సీనియర్ ఆటగాళ్లు తమ సొంత రాష్ట్ర జట్టుకు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. మిగిలిన కొందరు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఆడుతున్నారు. అంతలోనే రంజీ ట్రోఫీ మొదలైంది.
కానీ, ఆటగాళ్లు ఇలా ఏదో ఒక సిరీస్‌కు వెళితే.. దేశవాళీ ట్రోఫీకి నిజంగా పెద్ద అవమానం మరొకటి ఉండదు. సీనియర్లంతా అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా ఉంటున్నారు. వాళ్లపై పని భారం ఎక్కువ పడకుండా చూడాలి’ అని సన్నీ వెల్లడించాడు. అంతేకాదు కివీస్‌తో టెస్టు సిరీస్ ముగియగానే దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్ ఉండడంపై గవాస్కర్ స్పందిస్తూ.. అసలు ఆ సిరీస్ అవసరమే లేదని అన్నాడు.
‘నవంబర్‌లో కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వచ్చే నెలలో సఫారీలతో అనవసరమైన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉంది. అంతలోనే ఆస్ట్రేలియా పర్యటనకు భారత ఏ జట్టు వెళ్లనుంది. అందువల్ల కనీసం 50 నుంచి 60 మంది క్రికెటర్లు స్వరాష్టం తరఫున రంజీల్లో ఆడే అవకాశం కోల్పోతున్నారు. మరే దేశం కూడా ఇలా చేయదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను చూడండి. ఆ దేశాల ఆటగాళ్లు దేశవాళీకి తొలి ప్రాధాన్యమిస్తారు’ అని గవాస్కర్ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు.