Investors Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లు ‘బేర్’ మనడంతో మంగళవారం ఒక్కరోజే దేశీయ ఇన్వెస్టర్ల సంపద రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ మంగళవారం 930.55 పాయింట్ల నష్టంతో 80,220.72 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 1001.74 పాయింట్ల పతనంతో 80,149.53 పాయింట్లకు చేరుకుంది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,19,374.52 కోట్లు నష్టపోయి రూ.4,44,45,649.22 కోట్ల (5.29 లక్షల కోట్ల డాలర్లు) వద్ద స్థిర పడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) విక్రయించకపోయినా, దేశీయ ఇన్వెస్టర్లలోనే అనిశ్చితి నెలకొంది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టర్బో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ-30 లోని 3428 స్టాక్స్ నష్టపోగా, 559 షేర్లు లాభంతో ముగిశాయి. మరో 71 షేర్లు యధాతథంగా స్థిర పడ్డాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 3.81 శాతం, బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.52 శాతం నష్టంతో ముగిశాయి. ఇండస్ట్రీయల్ సెక్టర్ 3.51 శాతం, రియాల్టీ 3.29, మెటల్ 2.99, కమోడిటీస్ 2.80, పవర్ 2.64, యుటిలిటీస్ 2.84, టెలీ కమ్యూనికేషన్ 2.63, కన్జూమర్ డిస్క్రిషనరీ 2.54 శాతం నష్టాలతో ముగిశాయి.