Udhayanidhi Stalin | తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర గీతంలో ‘ద్రావిడ’ పదాన్ని తొలగించడంపై అధికార డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసున్నది. రాష్ట్ర గవర్నర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నూతన వధూవరులకు కీలక విజ్ఞప్తి చేశారు. తమిళనాడుపై హిందీని రుద్దేందుకు చాలామంది ప్రయత్నాస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో యువ జంటలు తమకు పుట్టబోయే పిల్లలకు తమిళంలోనే పేరుపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన వధూవరులు తమ పిల్లలకు తమిళ పేర్లుపెట్టి హిందీని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ఎప్పటికీ హిందీని స్వీకరించదని స్పష్టం చేశారు.
ఒకరు తమిళనాడు పేరును మార్చేందుకే ప్రయత్నించారని.. కానీ, రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరాలు రావడంతో క్షమాపణలు చెప్పారన్నారు. డీఎంకే పార్టీ, తమిళుడు ఉన్నంత వరకు ఎవరూ తమిళం, తమిళనాడు, ద్రావిడ పదాలను తుడిచివేయలేరన్నారు. తమిళనాడు ఎప్పటికీ హిందీ రుద్దడాన్ని ఆమోదించదంటూ ఆయన స్పష్టం చేశారు. ఇటీవల చెన్నైలోని దూరదర్శన్ కేంద్రం స్వర్ణోత్సవం నేపథ్యంలో హిందీ మాసోత్సవం సందర్భంగా స్నాతకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో గవర్నర్ రవి ప్రసంగంతో పాటు ఆలపించిన గీతంలోనూ ద్రావిడ పదం కనిపించలేదు.. వినిపించలేదు. అయితే, గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ద్రావిడ పదం లేకుండా మాట్లాడారని.. గేయంలోనూ ద్రావిడ పదం తొలగించారని మండిపడ్డారు. గవర్నర్ దాన్ని ప్రోత్సహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే కల్పించుకొని గవర్నర్‌ను రీకాల్ చేయాలన్నారు. అలాగే, దూరదర్శన్ ఉత్సవం తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
తమిళనాడు హిందీయేతర రాష్ట్రమని.. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఉత్సవాలను నిర్వహించడం కేంద్రం హిందీ రుద్దుడు ధోరణికి, పెత్తనానికి ప్రతీక అంటూ ధ్వజమెత్తారు. కార్యక్రమానికి వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం సైతం నిరసనలు చేపట్టింది. బహుళభాషాత్మక దేశంలో ఒకే భాషకు ఎక్కువ గౌరవం ఆపాదించడం అనుచితమనంటూ స్టాలిగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర భాషలను చిన్నచూపు చేసేందుకు ఇలాంటి చర్యలకు కేంద్రం దిగుతుందని.. హిందీకి పట్టం కట్టాలన్న ధోరణి కుదరదని.. దానికి బదులు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల మాసోత్సవం నిర్వహించడం సముచితంగా ఉంటుందంటూ చురకలంటించారు. అయితే, ద్రవిడ పదం లేకుండా చేయడం వెనుక గవర్నర్ తప్పిదం లేదని.. గీతాలాపనకు దిగిన వారి పొరపాటు ఏమీ లేదని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.