Gautam Gambhir | రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 12 సంవత్సరాల తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచింది. ఎనిమిది నెలల్లోనే వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను సాధించింది. గతేడాది జూన్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ని నెగ్గిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన తర్వాత పదవి నుంచి వైదొలిగాడు. గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. గంభీర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. కోచింగ్ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. అతని పర్యవేక్షణలోనే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సాధించింది.
ఎన్నో విమర్శల మధ్య టీమిండియా గంభీర్ పర్యవేక్షణలో చాంపియన్స్ ట్రోఫీ కోసం బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే దుబాయికి చేరుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ బుమ్రా.. కోలుకోలేకపోయాడు. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. బుమ్రా లేకపోవడంతో చాలా మంది మాజీలు సైతం భారత్ ఫైనల్‌కు చేరుతుందా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి.. ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో అటు బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించి చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సేన గెలిచింది.
చాంపియన్స్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచుల్లో భారత్ తుది జట్టులో హర్షిత్ రాణాకు అవకాశంకల్పించింది. కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చాన్స్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే, న్యూజిలాండ్‌పై విజయం సాధించడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. వరుణ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ దశలో భారత్ అజేయంగా నిలిచింది. సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ధీటుగా ఎదుర్కొంది.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓడించిన ఆసిస్ జట్టును తాజాగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌కు సైతం భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగి.. అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరింది. గత ఏడు నెలల్లో గంభీర్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ, తన పర్యవేక్షణలోనే టీమిండియా తొలి ఐసీసీ టైటిల్‌ను సాధించడంలో విజయవంతమైంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ని బీసీసీఐ కోచ్‌గా నియమించింది. గంభీర్ కోచింగ్ శైలి.. ద్రవిడ్‌కు భిన్నంగా ఉండడంతో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లతో సంబంధాలు ఎలా ఉంటాయన్న చర్చలు మొదలయ్యాయి. కొద్దికాలంలోనే గంభీర్ నైపుణ్యం.. కోచింగ్ నైపుణ్యం, అతని సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
గత సంవత్సరం జూలైలో గంభీర్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్ పదవీకాలంలో భారతదేశం టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. ఆ తర్వాత గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఫార్మాట్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హార్దిక్ పాండ్యాకు టీ20 సారథిగా నియమిస్తారని వార్తలు రాగా.. చివరి నిమిషంలో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ వరించింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నిర్ణయంతోనే టీమిండియాలో గంభీర్ శకం మొదలైంది.. సూర్యకు కెప్టెన్సీ రావడంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడని ప్రచారం జరిగింది.
గంభీర్ పదవీకాలం శ్రీలంక పర్యటనతో మొదలైంది. లంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, వన్డేలు ఆడాల్సి వచ్చింది. సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ అద్భుతంగా రాణించింది. శ్రీలంకపై టీ20 సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. అయితే, వన్డేల విషయానికి వస్తే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ నాయకత్వంలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. వన్డే సిరీస్‌లో లంక 2-0 తేడాతో టీంమిండియాను ఓడించింది. శ్రీలంక గడ్డపై జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో భారత్ 26 సంవత్సరాల తర్వాత తొలి సిరీస్‌ను కోల్పోయింది. వన్డే సిరీస్‌ను కోల్పోవడంతో గంభీర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ద్రవిడ్‌తో పోలుస్తూ వచ్చారు. లంక సిరీస్ తర్వాత టీమిండియాకు నెల రోజుల విరామం దొరికింది. సెప్టెంబర్ -జనవరి మధ్య భారత్ పది టెస్టులు ఆడింది. ఇందులో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ 2023-25 సైకిల్లో ఫైనల్ చేరుకోవడం, బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లు ఉన్నాయి.
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టులు ఆడింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గంభీర్ మార్గదర్శకత్వంలో భారత మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. భారతదేశం న్యూజిలాండ్‌ను ఎదుర్కొంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు స్వదేశంలో దారుణమైన ఆట తీరుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. కివీస్ జట్టు సొంత మైదానంలో భారత్‌ను 0-3 తేడాతో ఓడించింది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కష్టతరంగా మారింది. ఆ తర్వాత నవంబర్‌లో టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది.
గత రెండు పర్యటనల్లో టీమిండియా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను గెలిచింది. వరుసగా మూడోసారి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవాలనే కసితో ఆసిస్ గడ్డపై అడుగుపెట్టింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంతో భారత జట్టుతో పాటు హెడ్‌కోచ్ గంభీర్‌కు సైతం ఊరట లభించింది. కానీ, ఈ తర్వాత మ్యాచ్ నుంచే పరిస్థితి తలకిందులైంది. భారత్ అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్ట్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగిసింది. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలిచి బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను గెలిచింది. దాంతో వరుసగా మూడోసారి టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలన్న కల చెదిరిపోయింది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఘోర పరాజయం తర్వాత అభిమానుల ఓపిక నశించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్‌కోచ్ గంభీర్‌ను తొలగించాలని డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆస్ట్రేలియాలో ఓటమికి ప్రధాన కారణంగా ముగ్గురు మాత్రమేనని.. ఆస్ట్రేలియా పర్యటనలో డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. రోహిత్ ఐదో టెస్టుకు దూరంగా ఉంచడంతో అతని భవితవ్యం ఏంటనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వరుస ఓటముల తర్వాత బీసీసీఐ కీలక చర్యలు చేపట్టింది. ఆటగాళ్ల కోసం కొత్తగా మార్గదర్శకాలు చేసింది. గంభీర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. మోర్న్ మోర్కెల్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చేట్ను కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లో ఆడగా.. భారత జట్టు విజయం సాధించింది. అదే ఊపును కొనసాగిస్తూ చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ విజేతగా నిలిచింది.