Gautam Gambhir : భారత జట్టు హెడ్‌కోచ్ పదవిని చేపట్టనున్న గౌతం గంభీర్ (Gautam Gambhir) ముక్కుసూటిగా, మొండిగా వ్యహరిస్తాడని తెలిసిందే. ప్రస్తుతం హెడ్‌కోచ్ పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న గౌతీ ఐసీసీ రూల్స్‌పై స్పందించాడు. క్రికెట్లో రెండు కొత్త బంతుల(Two Ball Rule) నియమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. ‘రెండు బంతుల రూల్ అనేది అమోదయోగ్యం కాదు. ఆ నియమంతో చేతివేళ్లతో బంతి గమ్యాన్ని మార్చే స్పిన్నర్లకు నష్టం జరుగుతుంది’ అని గౌతీ వెల్లడించాడు.
‘క్రికెట్లోని ప్రతి రూల్ అందరికీ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అనువుగా ఉండాలి. అందుకని ముఖ్యంగా వన్డేల్లో రెండు బంతుల నిబంధన రద్దుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆలోచించాలి. ఎందుకంటే.. ఈ నియమం ఫింగర్ స్పిన్నర్లకు శరాఘాతం లాంటింది. కొత్త బంతులతో వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేరు. పైగా పేసర్లకు రివర్స్ స్వింగ్ కూడా సాధ్యపడదు. కాబట్టి వన్డేల్లో రెండు బంతుల నియమాన్ని రద్దు చేయడమే మంచిది’ అని గంభీర్ తెలిపాడు.

ఐసీసీ 2011 అక్టోబర్‌లో వన్డే ఫార్మాట్ నిబంధనల్లో మార్పులు చేసింది. రెండు కొత్త బంతులకు అనుమిచ్చింది. ఈ నియమంతో సమస్య ఏంటంటే.. బంతి కాస్త పాతబడ్డాక మరో బంతి తీసుకుంటారు. దాంతో, అది తొందరగా మెరుపు కోల్పోదు. దానికి తోడు బౌలర్లకు పట్టు లభించదు. రివర్స్ స్వింగ్ చేయడం సాధ్యం కాదు. చేతివేళ్లతో మాయ చేసే స్పిన్నర్లకు అయితే ఏమాత్రం బంతిని నియంత్రించే చాన్స్ ఉండదు. అందుకనే గంభీర్ ఈ నియమాన్ని రద్దు చేయాలని ఐసీసీని కోరాడు.