Gautam Gambhir | ఢిల్లీ: టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తిరిగి భారత జట్టుతో కలవనున్నాడు. పెర్త్ టెస్టు ముగిసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో ఢిల్లీకి వెళ్లిన గంభీర్.. సోమవారం ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యాడు. మంగళవారం అతడు జట్టుతో కలిసే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
హెడ్కోచ్ గౌతం గంభీర్ గత మంగళవారం (నవంబర్ 27న) స్వదేశానికి తిరిగొచ్చాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఢిల్లీకి వచ్చినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గంభీర్ మంగళవారం ఉదయమే వ్యక్తిగత కారణాలతో భారత్కు బయలుదేరాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టు కల్లా అతడు జట్టుతో కలుస్తాడు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అడిలైడ్ టెస్ట్ కంటే ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ లెవన్తో రెండు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు గంభీర్ అందుబాటులో ఉండడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్ బుధవారం భారత జట్టుకు విందు ఇవ్వనున్నారు.