Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా పాలైంది. ఆ తర్వాత భారత జట్టు ఆటతీరు, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సహాయక సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీలు టీమిండియా ప్లేయర్లతో సహా కోచింగ్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. హెడ్‌కోచ్‌గా గంభీర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీమిండియా ప్రదర్శన అధ్వాన్నంగా తయారైంది. ఈ క్రమంలో పలువురు మాజీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సిరీస్‌లలో ఓడిపోతూ టీమిండియా చెత్త రికార్డులను సృష్టిస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దాదాపు పదేళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో టీమిండియాకు హెడ్‌కోచ్‌గా గంభీర్ సరిపోడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.
టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతేడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచింది. మెగా కప్ గెలిచిన నాటి నుంచి టీమిండియా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రపంచకప్ విజయం తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత బీసీసీఐ హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించింది. టీమిండియాను అద్భుతంగా తీర్చిదిద్దుతాడని.. దాంతో మరింత దూకుడుగా ఆడుతుందని అందరూ భావించారు. గంభీర్ నాయకత్వంలో ఐపీఎల్లో నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత బీసీసీఐ జులైలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గంభీర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత నుంచి టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలవుతూ వస్తున్నది. గంభీర్ కోచింగ్ నేతృత్వంలో టీమిండియా టీ20 సిరీస్, వన్డే సిరీస్, మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. టీ20లో విజయం సాధించిన టీమిండియా.. వన్డే, టెస్టుల్లో మాత్రం వరుసగా ఓటములను చవిచూసింది.
స్వదేశంలో 12 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 0-3 తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమిపాలైంది. గంభీర్ సారథ్యంలో టీమిండియా ఐదు సిరీస్‌లో పాల్గొనగా.. రెండింట గెలిచి.. మూడింట్లో ఓటమిపాలైంది. మొత్తం 16 మ్యాచుల్లో ఆరింట విజయం సాధించి.. ఎనిమిది మ్యాచులు ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా.. మరో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ 16 మ్యాచ్‌ల్లో పది టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులున్నాయి. పది టెస్టుల్లో భారత్ మూడు విజయాలు సాధించగా.. ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మరొకటి డ్రాగా ముగిసింది. గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా మూడు టీ20 మ్యాచుల్లో విజయం సాధించగా.. మూడు వన్డేల్లో రెండింట ఓడిపోగా.. ఒకటి టై అయ్యింది.
గంభీర్ పదవీకాలం శ్రీలంక పర్యటన నుంచి మొదలైంది. మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో టీమిండియాను ఓడించింది. శ్రీలంక కొత్త కెప్టెన్ చరిత్ అస్లాంక సారథ్యంలో.. తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య పర్యవేక్షణలో టీమిండియాతో శ్రీలంక తలపడింది. మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 2-0తో భారత్‌ను ఓడించింది. తొలి వన్డే టైగా ముగిసింది. శ్రీలంక చివరిసారిగా 1997లో భారత్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో అర్జున రణతుంగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు.. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత జట్టును 3-0తో ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. అప్పటి నుంచి భారతదేశం-శ్రీలంక మధ్య 11 వన్డే సరీస్‌లు జరిగాయి. ఆయా సిరీస్లన్నింటిని టీమిండియా గెలిచింది. మళ్లీ 27 సంవత్సరల తర్వాత శ్రీలంకతో వన్డేల్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇక మూడు మ్యాచుల్లోనూ టీమిండియా ఆలౌట్ కావడం విశేషం. సిరీస్‌లో టీమిండియా 30 వికెట్లు కోల్పోగా.. ఇందులో 27 స్పిన్నర్లే తీయడం గమనార్హం. వన్డే సిరీస్‌లో స్పిన్ బౌలింగ్‌పై అత్యధిక వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 2024లో భారత్ ఏ వన్డేల్లో విజయం సాధించలేకపోయింది. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత జట్టు ఒక వన్డే కూడా గెలువకపోవడం 45 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1979లో భారత జట్టు వన్డేల్లో గెలుపొందలేదు.
టీమిండియా దాదాపు 36 సంవత్సరాల తర్వాత టెస్టుల్లో ఓటమిపాలైంది. స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల్లో ఒక దాంట్లోనూ విజయం సాధించలేదు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై కివీ జట్టు చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇంతకు ముందు 1988లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం భారత క్రికెట్ జట్టుకు పెట్టని కోటగా ఉన్నది. అయితే, 19 సంవత్సరాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది. చివరిసారిగా 2005లో భారత్ పాక్ చేతిలో ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో టీమిండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 46 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. స్వదేశంలో భారత జట్టు అత్యల్ప స్కోరుకే ఔటైంది. బెంగళూరు తర్వాత పుణే, ముంబయిలోనూ ఓడిపోయింది. 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. పుణే టెస్టు తర్వాత ఓడిపోయింది.
2012లో స్వదేశంలో జరిగిన చివరి టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఆ తర్వాత వరుసగా 18 టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుంది. పుణే టెస్టు తర్వాత కూడా టీమిండియా ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండానే.. ముంబయి వేదికగా జరిగిన టెస్టులో ఓటమిపాలైంది. భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అలాగే, 24 ఏళ్ల తర్వాత ఒక జట్టు స్వదేశంలో రెండు.. అంతకంటే అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను వైట్‌వాష్ చేసింది. ఇంతకు ముందు 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా రెండు టెస్టులను క్లీన్ స్వీప్ చేసింది. టెస్టుల్లో స్వదేశంలో మూడు, అంతకంటే ఎక్కువ మ్యాచుల్లో భారత్‌కు ఇదే తొలి క్లీన్‌స్వీప్. 1933 నుంచి టెస్టులు ఉండుతుండగా.. 91 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. స్వదేశంలో టీమిండియాను వైట్‌వాష్ చేసిన జట్టుగా నాలుగో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-3 తేడాతో ఓడిపోయింది. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పెర్త్‌లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన డేనైట్ టెస్టులో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు డ్రాగా ముగిసింది. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిడ్నీ టెస్టులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో గెలుచుకుంది. భారత్ చివరిసారిగా 2014-15లో ఈ సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా 2-0తో విజయం సాధించింది. భారత్ పదేళ్ల తర్వాత వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయం పాలైంది. ఇంతకు ముందు 2014లో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ 1-3తో ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా 2-0తో ఓడిపోయింది.
బంగ్లాదేశ్‌పై భారత్ టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ-గంభీర్ జోడీపై పలువురు క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియాతో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను కోల్పోయిన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత గడ్డపై సింహాలుగా పేరొందిన భారత జట్టు.. స్వదేశంలో అనూహ్యంగా ఓటమిపాలవగా.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్‌ను కోల్పోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీమిండియాను ఆకాశానికి ఎత్తిన వారంతా.. ప్రస్తుతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం వరుస పరాజయాల నేపథ్యంలో ఒంటిచేత్తో విజయాలు అందించిన హిట్‌మ్యాన్‌తో పాటు కోచ్ గంభీర్‌పై మండిపడుతున్నారు.
కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే సమయంలో గంభీర్ బీసీసీఐ ముందు కొన్ని డిమాండ్లు పెట్టాడు. తనకు ఇష్టమైన కోచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేసుకోవడంతో పాటు జట్టులో అవసరమైన మార్పులు చేసుకునే వీలు కల్పించాలని డిమాండ్ పెట్టాడు. గంభీర్ పట్టుబట్టడంతోనే అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ దోస్చేట్ను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమించింది. జహీర్ ఖాన్ కంటే మోర్నే మోర్కెల్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. బౌలింగ్ కోచ్‌గా తీసుకువచ్చారు. అప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్ అధ్వాన్నంగా తయారైంది. బౌలింగ్‌లో కేవలం జస్ప్రీత్ బుమ్రా తప్పించి మిగతా ఎవరూ ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోయారు.