భారత క్రికెట్లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లలో మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత తన ప్యాషన్‌తో భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. అలాంటి గంగూలీ మాటలకు తను ఒక రాత్రంతా నిద్ర లేకుండా గడిపానని మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ వెల్లడించాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన యువీ.. 2000 ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్లో తన అరంగేట్ర మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. ‘‘అప్పట్లో నా వయసు 18 ఏళ్లు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై అరంగేట్రం చేస్తున్నా. అలాంటి ఒత్తిడిలో ఉన్న నా దగ్గరకు గంగూలీ వచ్చాడు. రేపు మ్యాచ్‌లో నువ్వు ఓపెనింగ్ చేస్తావా? అని అడిగాడు. చెయ్యమంటే చేస్తాను అని ధైర్యంగా చెప్పాను. కానీ ఆ టెన్షన్‌తో రాత్రంతా నిద్ర పట్టలేదు’’ అని యువీ గుర్తుచేసుకున్నాడు.
అయితే మర్నాడు ఉదయం గంగూలీని ఇదే విషయం అడిగితే.. ‘‘నేను ఏదో ప్రాంక్ చేశానులే’’ అని చెప్పి తనే ఓపెనింగ్ చేయడానికి వెళ్లిపోయాడని యువీ అన్నాడు. దాంతో ఆశ్చర్యపోయిన యువీ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లో 84 బంతుల్లో 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
యువీ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత జట్టు 265/9 పరుగులు చేసింది. ఆ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా యువీ అద్భుతంగా రాణించాడు. పించ్ హిట్టర్ అయిన మైకేల్ బెవాన్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 245 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల వద్ద యువీ క్యాచ్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు వదిలేశారు. దీని గురించి కూడా చెప్పిన యువీ.. అప్పుడు అవుటై ఉన్నా కూడా సంతోషంగానే ఉండేవాడినని చెప్పాడు. ఎందుకంటే తాను ఎదుర్కొంటున్న బౌలింగ్ బలం అలాంటిదని పేర్కొన్నాడు.