Gambia Football Team : గాంబియా ఫుట్‌బాల్ జట్టుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (Africa Cup Of Nations)లో పాల్గొనేందుకు విమానంలో బయలు దేరిన ఆ జట్టు సభ్యులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఐవరీ కోస్ట్(Ivary Coast) వెళ్లేందుకు గాంబియా ఫుట్‌బాల్ టీమ్ ఎక్కిన విమానంలో అనుకోకుండా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో, భయానికి గురైన ఆటగాళ్లు ఇక తమ పని అయిపోయినట్టు అనుకున్నారు.
అయితే.. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాంతో, ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది హమ్మయ్యా బతికిపోయాం రా బాబు అనుకున్నారు. కొంచెం సేపటికే అధికారులు మరో విమానం ఏర్పాటు చేయడంతో గాంబియా జట్టు ఐవరీ కోస్ట్‌కు బయలేదేరింది. ఈ సంఘటన అనంతరం గాంబియా ఫుట్‌బాలర్ సాడీ జన్కో(Saidy Janko) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టాడు.
అందులో ఆక్సిజన్ నిలిచిపోవడంతో కొందరికీ విపరీతంగా చెమటలు పట్టాయి. మరికొందరేమో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. జనవరి 13 నుంచి మొదలయ్యే ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో మొత్తం 24 జట్లు పాల్గొననున్నాయి. వీటిని ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.