ముంబై: ఏడాది వ్యవధిలోనే స్వదేశంలో రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ వైట్వాష్నకు గురైన భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందా? అందరూ వేలెత్తి చూపిస్తున్నట్టుగానే హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై వేటు తప్పదా? పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రాణిస్తున్నా టెస్టుల్లో విఫలమవుతున్న అతడిని ఆ ఫార్మాట్ నుంచి తప్పించి ‘మెన్ ఇన్ బ్లూ’కు ఇద్దరు కోచ్‌ల సంస్కృతికి తెరతీయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నిరుడు న్యూజిలాండ్, కొద్దిరోజుల క్రితమే దక్షిణాఫ్రికా..
భారత్‌ను భారత్‌లో వైట్‌వాష్ చేసి సంచలనం సృష్టించాయి. దీనికి తోడు టెస్టుల్లో కోచ్‌గా గంభీర్‌కు దారుణమైన రికార్డు ఉంది. అతడి హయాంలో భారత జట్టు 19 మ్యాచ్‌లు ఆడితే అందులో 7 మాత్రమే గెలిచి ఏకంగా పదింట్లో ఓడింది. రెండింటిని డ్రా చేసుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్‌ను మార్చాలన్న డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో బీసీసీఐ.. సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. అయితే అందుకు విముఖత వ్యక్తం చేసినట్టు బోర్డు వర్గాల సమాచారం.
ప్రస్తుతానికి హెడ్‌కోచ్ పదవికి వచ్చిన ముప్పేమి లేకపోయినా గంభీర్‌పై భారీ ఒత్తిడే ఉంది. టెస్టుల్లో భారత ప్రదర్శన నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్‌లో జరుగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అతడికి అత్యంత కీలకం కానుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్.. టైటిల్‌ను నిలబెట్టుకుంటేనే గంభీర్ కెరీర్ సాఫీగా సాగే అవకాశముంటుందని, లేదంటే బీసీసీఐ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే టీమ్ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో విభేదాలున్నాయని.. గంభీర్‌తో సీనియర్లకు పొసగడం లేదన్న ప్రచారమూ సాగుతున్న తరుణంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్‌ను అందించడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్.