ముంబై: భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్ రేసులో ఉన్న గౌతం గంభీర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. మంగళవారం బీసీసీఐ ఆధ్వర్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. గంభీర్‌ను వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. దీనిపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘అవును. ఈరోజు సీఏసీతో గంభీర్ వీడియో కాల్లో తొలి రౌండ్ ఇంటర్వ్యూను పూర్తిచేశాడు. బుధవారం మరో రౌండ్ ఉంటుంది’ అని వెల్లడించాడు.
సీఏసీ చైర్మన్ అశోక్ మల్హోత్రా, సభ్యులు జతిన్ పరంజపె, సులక్షణ నాయక్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఐసీసీ టోర్నీలు ముందున్న నేపథ్యంలో రాబోయే మూడేండ్లలో తన ప్రణాళికలను గంభీర్.. సీఏసీకి వివరించినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. బుధవారం నాటి ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా పూర్తయితే రాబోయే రెండు, మూడు రోజుల్లో గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.