Gagan Narang | ఢిల్లీ: త్వరలో జరుగబోయే పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్‌గా మాజీ షూటర్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ గగన్ నారంగ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. గతంలో ఈ బాధ్యతలను దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌కు అప్పగించినా వ్యక్తిగత కారణాలతో ఆమె వాటి నుంచి వైదొలగడంతో ఐవోఏ గగన్ నారంగ్‌ను నియమించింది.
ఇక విశ్వక్రీడల ఆరంభ కార్యక్రమంలో భారత పతాకధారులుగా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తెలుగమ్మాయి పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్‌కమల్ ఉండనున్నారు. ఈసారి ఒలింపిక్స్‌కు భారత్ సుమారు వంద మందికి పైగా క్రీడాకారులను బరిలో నిలిపింది.