నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : రెండ్రోజుల క్రితం జెడ్డా వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వారిలో 182 మందిని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. అమ్ముడుపోని ఆటగాళ్లు 395. వీరిలో భారత్ తరఫున ఆడటమే గాక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పలువురు ఆటగాళ్లకు ఈసారి వేలంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించగా కేన్ మామ, మయాంక్ వంటి వాళ్లు పొట్టి ఫార్మాట్‌కు సరిపోరని ఇప్పటికే స్పష్టమైంది. కానీ అందర్నీ ఆశ్చర్యపరిచింది షా, శార్దూల్‌ను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడమే. మరి ఈ ముంబైకర్ల కెరీర్ ముగిసినట్టేనా?
టాలెంట్‌కు కొదవ లేదు. టెక్నిక్కు తిరుగులేదు. దూకుడు కావాల్సినంత ఉంది. అండర్ -16 క్రికెటర్‌గా ఉన్నప్పుడే ఓ డివిజన్ మ్యాచ్‌లో 546 పరుగులు చేస్తే భారత క్రికెట్‌కు మరో సచిన్ దొరికేసినట్టే అన్న ప్రశంసలు. టెక్నిక్, దూకుడులో సెహ్వాగ్‌ను తలపిస్తున్నాడని పొగడ్తలు.. దేశవాళీలో పరుగుల వరద పారించి 2018లో అండర్-19 వరల్డ్ కప్ గెలిపించిన సారథి షా.. భారత క్రికెట్లో ఆగమనమే ఓ సంచలనం. ఆ ఏడాది అతడు ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ నమోదు చేయడంతో షా పేరు మార్మోగిపోయింది. ఐపీఎల్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపించడంతో ఇక అతడికి తిరుగేలేదన్నారు విమర్శకులు. కానీ ఆ తర్వాత షా కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. 2019లో నిషేధ ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను అతడిపై 8 నెలల నిషేధం పడింది.
ఆ తర్వాత దేశవాళీలలో మళ్లీ నిరూపించుకున్నా తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఇక 2023లో ముంబైలో ఓ యూట్యూబర్‌తో సెల్ఫీ వివాదం షా కెరీర్‌ను మరింత అధమ స్థాయికి దిగజార్చింది. 2023 ఐపీఎల్లో 106 రన్స్ మాత్రమే చేసిన అతడు.. గత సీజన్లో 8 మ్యాచ్‌లలో 198 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ఫామ్, వివాదాలకు తోడు క్రమశిక్షణారాహిత్యం షాను నిండా ముంచింది. ఈ ఏడాది రంజీ సీజన్‌కు ముందు ఫిట్నెస్ (అధిక బరువు కారణంగా) లేదని ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయిన షాను వేలంలో (కనీస ధర రూ. 75 లక్షలు) కొనుగోలు చేయడానికి ఒక్కటంటే ఒక్క ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఒకప్పుడు మరో సచిన్ అవుతాడనుకున్న ఈ 25 ఏండ్ల ముంబై కుర్రాడు.. మరో కాంబ్లి అయ్యే ప్రమాదంలో ఉన్నాడని, ఇకనైనా మేలుకోకుంటే భారత క్రికెట్లో అతడి కథ ముగిసినట్టేనని హెచ్చరించేవాళ్లూ లేకపోలేదు.
షాతో పాటు వేలంలో శార్దూల్ అమ్ముడవకపోవడమూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2022 వేలంలో ఈ ముంబై పేస్ ఆల్‌రౌండర్‌పై ఢిల్లీ ఏకంగా రూ. 10.75 కోట్లు వెచ్చించింది. 2023లో చెన్నై గూటికి వెళ్లిన అతడిని ఆ ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దూల్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. 33 ఏండ్ల ఈ ముంబైకర్ గత మూడు సీజన్లుగా వహ్వా అనిపించే ప్రదర్శన చేయకపోవడం ఒక కారణం కాగా బీసీసీఐ తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అతడిని దెబ్బకొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చాలా ఫ్రాంచైజీలు ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సిక్సర్లు బాదే బ్యాటర్‌ను, వికెట్లు తీసే బౌలర్‌ను చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నాయి. ఆల్రౌండర్లకు ఈ నిబంధన శరాఘాతమైందని కొంతకాలంగా వాదనలు వినిపిస్తుండగా తాజా వేలంలో అది నిజమేనని తేలింది. డారిల్ మిచెల్, మోయిన్ అలీ వంటివాళ్లపై ఫ్రాంచైజీలు శీతకన్ను వేశాయి. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఒకదశలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకురాలేదు.