ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌ది సుదీర్ఘమైన చరిత్ర. టోర్నీ ఆరంభం నుంచి ఉన్న జట్టలో ఈ రెండూ ఉన్నాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాదిరిగానే ఢిల్లీ, పంజాబ్ సైతం ఇంకా టైటిల్ బోణీ కొట్టలేదు. 17 సీజన్లుగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 18వ సీజన్లో అయినా అందుకోవాలని ఇరుజట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. కొత్త కెప్టెన్లు, స్టార్ ప్లేయర్లు, సమర్థమైన హెడ్‌కోచ్‌ల మార్గదర్శకత్వంలో ఆడనున్న ఢిల్లీ, పంజాబ్ 18వ ప్రయత్నంలో అయినా సఫలమవుతాయా? ఈ జట్ల టైటిల్ నిరీక్షణ 2025లో అయినా తీరుతుందా?
IPL | ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు టైటిల్ మాత్రం 17 ఏండ్లుగా అందని ద్రాక్షే అవుతోంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌గా ఆరంభమైన ఆ జట్టు ప్రస్థానం.. కొన్నేండ్ల తర్వాత తమ పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుని జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. పేరు మారినా.. పేరు మోసిన సారథులు, నాణ్యమైన ఆటగాళ్లు, మెరుగైన హెడ్‌కోచ్‌లు.. ఇలా ఎంతమంది మారుతున్నా క్యాపిటల్స్ రాత మారడం లేదు. 2020లో ఫైనల్ చేరడమే ఇప్పటిదాకా ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లలో అయితే లీగ్ దశలోనే వెనుదిరిగింది. వీరేంద్ర సెహ్వాగ్, కెవిన్ పీటర్సన్, గౌతం గంభీర్, జహీర్ ఖాన్, మహేళ జయవర్దెనే వంటి దిగ్గజ సారథులతో పాటు వర్ధమాన క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌కు సాధ్యం కానిది కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ వల్ల అవుతుందా? బాపు (అక్షర్ ముద్దు పేరు) క్యాపిటల్స్ ఆశలను నెరవేరుస్తాడా? అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.
వేలంలో తమ సారథి పంత్‌ను వదులుకుని మరీ జట్టు ప్రక్షాళన చేపట్టిన ఢిల్లీ ఈసారి బ్యాటింగ్‌లో పటిష్టంగానే కనిపిస్తోంది. గత సీజన్లో మెరుపులు మెరిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ ఈ సీజన్లో వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్‌తో ఓపెనింగ్ చేసే అవకాశముంది. తమదైన రోజున ఈ ద్వయం ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలదు. ఇక గత ఆరు సీజన్లలో 500కు పైగా స్కోర్లు చేస్తూ నిలకడకు నిలువుటద్దంలా ఉన్న కేఎల్ రాహుల్ కూడా ఢిల్లీకి ఆడనుండటం ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టపరుస్తోంది. ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్తో పాటు సారథి అక్షర్ మెరుపులు ఢిల్లీ బ్యాటింగ్‌కు అదనపు ఆకర్షణ. గత సీజన్లో పంజాబ్‌కు ఆఖర్లో అనూహ్య విజయాలు అందించిన అశుతోశ్ శర్మ కూడా ఈసారి ఢిల్లీకి ఆడనుండగా అతడు ఫినిషర్ పాత్ర పోషించగలడు. దేశవాళీ టీ20 స్టార్ సమీర్ రిజ్వి సైతం ఈ సీజన్లో ఢిల్లీకే ఆడుతుండటంతో బ్యాటింగ్ విభాగంలో ఢిల్లీ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాట్‌తో పాటు బంతితోనూ ఢిల్లీ బలోపేతంగానే ఉంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను వేలంలో రూ. 11.75 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ.. అతడిపై భారీ ఆశలే పెట్టుకుంది. అతడికి అండగా యార్కర్ల నట్టూ (నటరాజన్), మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్ ఉన్నారు. డెత్ ఓవర్లలో ఈ త్రయం కీలకం కానున్నారు. స్పిన్ భారాన్ని అక్షర్, కుల్దీప్ మోయనున్నారు.
అయితే సిసలైన పేస్ ఆల్‌రౌండర్లు లేకపోవడం ఢిల్లీకి పెద్ద లోటు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ను మినహాయిస్తే ఆ జట్టులో ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త కోచ్ హేమాంగ్ బదానీ, మెంటార్ పీటర్సన్ మార్గనిర్దేశకత్వంలో ఢిల్లీ తమ ట్రోఫీ కలలను ఏ మేరకు నెరవేర్చుకుంటుందన్నది ఆసక్తికరం. ఐపీఎల్లో ఇప్పటిదాకా 17 సీజన్లు జరిగితే 17 సార్లూ సారథులను మార్చిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది కచ్చితంగా పంజాబ్ కింగ్స్ మాత్రమే. సీజన్ మారిన ప్రతీసారి (ఒక్కోసారి సీజన్ మధ్యలోనే) ఆ జట్టు కెప్టెన్ మారడం ఆనవాయితీగా వస్తోంది. యువరాజ్, సంగక్కర, గిల్‌క్రిస్ట్, బెయిలీ, మ్యాక్స్‌వెల్, అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్.. ఇలా 17 మంది సారథులు మారారు. తాజాగా 18వ సీజన్లో పంజాబ్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. పదేండ్ల విరామం తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నిరుడు ట్రోఫీని అందించిన శ్రేయస్.. ఈసారి పంజాబ్‌ను నడిపించనున్నాడు. తాను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేప్పుడు పనిచేసిన హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ అండగా తమ టైటిల్ ఆశలను శ్రేయస్ నెరవేర్చుతాడని పంజాబ్ భావిస్తోంది. శ్రేయస్ కోసం వేలంలో మిగిలిన ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ రికార్డు స్థాయిలో రూ. 26.75 కోట్ల (ఈ లీగ్‌లో రెండో అత్యధిక ధర)కు దక్కించుకున్న పంజాబ్ ఆశలను అయ్యర్ తీర్చుతాడా? పంజాబ్‌ను ‘కింగ్’గా నిలబెడుతాడా? సీజన్ మారినా తన సారథ్యానికి డోకా లేదని నిరూపించుకుంటాడా?
మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్.. మ్యాచ్‌ను ఎలాంటి పరిస్థితుల్లో అ యినా మలుపు తిప్పగల ఆల్‌రౌండర్లు పంజా బ్ సొంతం. లీగ్‌లో ఎవరికీ లేని ఆల్‌రౌండర్ల బలం పంజాబ్‌కు ఉంది. అయితే ఫైనల్ లెవన్‌కు వచ్చేసరికి ఎవరిని ఎంచుకోవాలి? ఎవరిని బెంచ్‌పై కూర్చోబెట్టాలన్నది మాత్రం పంజాబ్‌కు తలనొప్పే. ధావన్‌ను పక్కనబెట్టేయడంతో ఈ సీజన్లో పంజాబ్‌కు ఓపెనింగ్ కాంబినేషన్ కొత్త సమస్యగా మారింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారన్నది ఆసక్తికరం. పైన పేర్కొన్న ఆల్‌రౌండర్ల జాబితాలో చాలామంది ఫినిషర్లే. ఓపెనింగ్ సమస్య తప్పితే టాపార్డర్, మిడిలార్డర్లో ఆ జట్టు బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా ఉంది. శశాంక్ సింగ్, నెహల్ వధేరా రూపంలో పంజాబ్‌కు అద్భుతమైన ఫినిషర్లు ఉన్నారు. శ్రేయస్ జట్టును నడిపించడంతో పాటు బ్యాట్‌తోనూ అదరగొడితే ప్రత్యర్థులకు తిప్పలు తప్పవు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే టీ20లలో అంచనాలకు మించి రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ ఆ జట్టు ప్రధాన బలం. అతడితో కొత్త బంతిని ఎవరు పంచుకుంటారనేది ఆసక్తికరం. అర్ష్‌దీప్ మినహా నమ్మదగ్గ పేసర్ల కొరత పంజాబ్‌కు లోటే. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న యుజ్వేం ద్ర చాహల్ ఈసారి పంజాబ్‌తో ఆడనుండటం ఆ జట్టుకు లాభించేదే. ముల్లాన్పూర్తో పాటు ధర్మశాలలో మ్యాచ్‌లు ఆడనున్న కింగ్స్.. ఓవర్సీస్ ప్లేయర్లపై ఎక్కువగా ఆధారపడ్డా కష్టమే. విదేశీ ఆటగాళ్ల బెంచ్ బలంగా ఉన్నప్పటికీ తు ది జట్టులో ఉండేది నలుగురే. అయితే దేశవాళీల్లో మంచి రికార్డు కలిగిన ఆటగాళ్లలో శశాంక్ మినహా పంజాబ్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ.