IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) 16వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్స్ రేసు దగ్గరపడిన కొద్దీ ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లింగ్ విజయాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిన పవర్ హిట్లర్లు సిక్సర్లతో హోరెత్తించారు. మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే గత సీజన్ సిక్స్‌ల రికార్డు బద్ధలు కొట్టారు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 1,066 సిక్స్‌లు నమోదయ్యాయి. పదహేనో సీజన్లో 1,062 సిక్స్‌లు మాత్రమే కొట్టారు. ఇంకా క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో, మరిన్ని సిక్స్‌లు చూసే అవకాశం ఉంది.
ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ -5 ఆటగాళ్ల జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ అందరి కంటే ముందున్నాడు. అతడి ఖాతాలో 36 సిక్స్‌లు ఉన్నాయి. ఇక సిక్సర్ల దూబేగా పేరొందిన శివం దూబే(చెన్నై సూపర్ కింగ్స్) 33 సిక్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ విధ్వంసక ప్లేయర్ 31 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న రింకూ సింగ్(కోల్‌కతా నైట్ రైడర్స్) 29 సిక్స్‌లతో నాలుగో ప్లేస్ సాధించాడు. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 28 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.
ఫాఫ్ డూప్లెసిస్ – గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆర్సీబీ)
మే 23వ తేదీన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఢీ కొంటాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో ఫైనల్ బెర్తు కోసం తలపడుతుంది.