ఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమ్ఇండియాకు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్థానంలో మోర్కెల్ సేవలందించనున్నాడు. వచ్చే నెల 19న బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌తో మొదలయ్యే మోర్కెల్ ఒప్పందం.. మూడేండ్ల పాటు (2027 వన్డే వరల్డ్ కప్ ముగిసేదాకా) కొనసాగనుంది. సఫారీ మాజీ పేసర్ నియామకంతో హెడ్ కోచ్ గంభీర్ తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. కోచ్‌గా నియమితుడయ్యేప్పుడే గంభీర్ తన సహాయక సిబ్బంది విషయంలో స్వేచ్ఛను ఇవ్వాలని కోరగా బీసీసీఐ అందుకు అంగీకారం తెలిపినట్టు వార్తలు వచ్చా గౌతీ అనుకున్నట్టుగానే అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్, రియాన్ డస్కటె నియమితులు కాగా తాజాగా మోర్కెల్ సైతం బౌలింగ్ విభాగాన్ని పర్యవేక్షించనుండటం గమనార్హం. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందే ఎన్సీఏకు రానున్న మోర్కెల్.. దులీప్ ట్రోఫీలో బౌలర్ల ప్రదర్శనపై కన్నేయనున్నాడు.
భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు సైతం దేశవాళీలో ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశాలిచ్చిన బీసీసీఐ.. సీనియర్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌కు మినహాయింపునిచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి జరుగబోయే తొలి రౌండ్ మ్యాచ్‌లకు గాను నాలుగు గ్రూపులుగా విభజించి ప్రకటించిన జట్లలో ఆ నలుగురిని ఎంపిక చేయలేదు.