Kohli – Rohit: టీమిండియా సారథి రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్‌ను ‘వీక్ ప్లేయర్’ అని, స్వదేశంలో తప్ప విదేశాల్లో అతడు ఓపెనర్‌గా చేసిందేమీ లేదని సంచలన ఆరోపణలు చేశాడు. టెస్టులలో రోహిత్‌ను తప్పించి కోహ్లీకే పగ్గాలు అప్పజెప్పాలని, సేన (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై కోహ్లీకి బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గా కూడా మెరుగైన రికార్డు ఉన్నదని బద్రీనాథ్ అన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇటీవలే సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘సేన దేశాలపై కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా అతడు ఐదు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి సగటు 52కు పైగా ఉంది. 68 టెస్టులకు సారథిగా వ్యవహరించిన కోహ్లీ.. 40 మ్యాచ్‌లలో గెలిచి 17 మ్యాచ్‌లలో ఓడాడు. ఆస్ట్రేలియాలో అతడి సారథ్యంలోనే భారత్ అద్భుత విజయాలు సాధించింది. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత టెస్టులలో అత్యధిక టెస్టు విజయాలు కలిగిన సారథి కోహ్లీ మాత్రమే.. ఇన్ని రికార్డులు ఉన్న కోహ్లీ టెస్టులలో భారత జట్టును ఎందుకు నడిపించడం లేదు..?
కోహ్లీ టెస్టులలో మెరుగైన బ్యాటర్. కోహ్లీ, రోహిత్ మధ్య పోలిక లేదు. టెస్టులలో మాత్రం కోహ్లీ బిగ్ ప్లేయర్. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కోహ్లీ పరుగులు చేశాడు. కానీ మన టీమ్‌ను వీకర్ ప్లేయర్ ఎందుకు నడిపించాలి..? అతడు (రోహిత్‌ను ఉద్దేశిస్తూ) టెస్టులలో ఇంకా ఓపెనర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకోలేదు. జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. మనం దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. స్వదేశంలో తప్పితే విదేశాల్లో రోహిత్ ఓపెనర్‌గా తనదైన ముద్ర వేయలేదు. అయినా అతడు ఇంకా అక్కడ (కెప్టెన్‌గా) ఎందుకున్నాడు..?’ అని బద్రీనాత్ వ్యాఖ్యానించాడు.