Madan Lal : క్రికెట్లో దూకుడు అవసరమే కానీ.. మరీ ప్రత్యర్థి ప్లేయర్లు చిన్నబుచ్చుకునేలా.. అవమానించడం సరైంది కాదు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న భారత జట్టుకు ఇది ఏమాత్రం సరిపోయే అంశం కాదు. కానీ బంగ్లాదేశ్ మహిళల జట్టుతో వన్డే సిరీస్ సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ట్రోఫీ అందించే సమయంలో బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్లానా(Nigar Sultana)ను ఆమె చులకనగా చూడడంపై భారత లెజెండ్ మదన్‌లాల్(Madan Lal) ఆగ్రహం వ్యక్తం చేశాడు.
హర్మన్‌ప్రీత్‌కు మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా, నాలుగు డీమెరిట్ పాయింట్లతో సరిపెట్టకూడదని పేర్కొన్నాడు. ‘హర్మన్ తీరు ఏమాత్రం బాగా లేదు. ఆటకంటే ఎవరూ ఎక్కువ కాదు. బంగ్లాదేశ్ మహిళల జట్టుతో హర్మన్ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. తన వల్ల భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చింది. ఈ అంశంపై బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మదన్‌లాల్ ట్వీట్ చేశాడు. కౌర్‌పై కనీసం 6 నెలలు నిషేధం వింధించాలని ఓ అభిమాని చేసిన ట్వీట్‌ను మదన్‌లాల్ రీ-ట్వీట్ చేశాడు.
I think she should be suspended from playing all kinds of Cricket for at least 6 months, before some sense dawns on her. Absolutely disgraceful. pic.twitter.com/fAp417FHOs
— Gabbar (@GabbbarSingh) July 23, 2023
శనివారం భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే ‘టై’(Tie)గా ముగిసింది. అప్పటికే ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి ఉండటంతో సిరీస్‌ను సమంగా పంచుకోవాల్సి వచ్చింది. అయితే.. లక్ష్యఛేదనలో హర్మన్‌ప్రీత్ ఔటైన విధానం చర్చకు కారణమైంది. అంపైర్ తన్వీర్ అహ్మద్( Tanvir Ahmed) తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో.. స్టేడియంలోనే తన అక్కసు వెల్లగక్కిన హర్మన్ బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. మ్యాచ్ అనంతరం కూడా అదే కోపం కొనసాగిస్తూ.. ప్రజంటేషన్ సమయంలో ప్రత్యర్థి కెప్టెన్‌తో అవమానకర రీతిలో వ్యవహరించింది. ‘మీరెందుకు వచ్చారు. ట్రోఫీ అందుకోవడానికి.. మేము అంపైర్ల చేతిలో కదా ఓడింది. వాళ్లని పిలవండి. వాళ్లతో ట్రోఫీ పంచుకుంటాం’ అని వ్యాఖ్యానించింది.
దీంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా.. తన జట్టు సభ్యులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఐసీసీ వికెట్లను బ్యాట్‌తో కొట్టినందుకు 50 శాతం.. ప్రత్యర్థి ప్లేయర్‌తో దురుసుగా మాట్లాడినందుకు 25 శాతం కలిపి మొత్తం హర్మన్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పడిన విషయం తెలిసిందే.