Virat Kohli, : ప్రపంచంలోని ఫిట్టెస్ట్ క్రికెటర్(Fittest Cricketer) ఎవరు? అని అడిగితే.. విరాట్ కోహ్లీ(Virat Kohli) అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. ఆటతో పాటు ఫిట్నెస్తో విరాట్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలిచాడు. మూడు పదుల వయసులోనూ కుర్రాళ్లతో సై అంటే సై అనే రీతిలో కోహ్లీ తలపడడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. కెరీర్ మొదట్లో ఫిట్‌నెస్‌కు అంతగా ప్రాధాన్యమివ్వని ఈ డాషింగ్ బ్యాటర్ ఆ తర్వాత సహచర క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. బాడీ ఫిట్‌గా కనిపించేందుకు కోహ్లీ రోజువారీ అహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడనే విషయం తెలుసా..?
టీమిండియా ఆటగాళ్లకు ఫిట్నెస్ను పరిచయం చేసింది కోహ్లీనే. అప్పటి వరకు ఫిట్‌నెస్‌కు ఆమడ దూరంలో ఉండే మనోళ్లు విరాట్‌ను చూసి జిమ్ బాట పట్టారు. మైదానంలో పాదరసంలా కదలుతూ, వేగంలో చిరుతను తలపించే కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటూ సీనియర్, జూనియర్ క్రికెటర్లు తమ అహారపు అలవాట్లను మార్చుకున్నారు. ఫిట్‌గా ఉంటేనే కఠినమైన యో-యో టెస్టు(Yo-Yo test) పాసయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కూడా ఫిట్నెస్ విషయంలో మరింత ప్రాధాన్యమిస్తూ పోయింది.
ఇంతకు కోహ్లీ ఎలాంటి భోజనం చేస్తాడు? రోజుకు ఎన్ని క్యాలరీలు అందేలా చూసుకుంటాడు? ఎలాంటి వ్యాయామం చేస్తాడు? వంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్క అభిమాని అనుకుంటాడు. ఇటీవల ఒక ప్రముఖ స్పోర్ట్స్ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కోహ్లీ తన ఫిట్నెస్ రహస్యం గురించి చెప్పుకొచ్చాడు. పాన్-గ్రిల్డ్ ఫుడ్(Pan Grilled Food)కు ప్రాధాన్యమిచ్చే కోహ్లీ… కొన్ని సమయాల్లో స్టీమ్, బాయిల్డ్ ఫుడ్(Boiled Food) తీసుకునేందుకు ఇష్టపడుతాడట.
వేగన్‌గా మారిన కోహ్లీ
మసాలా వంటకాలకు పూర్తిగా దూరంగా ఉండే విరాట్.. తాజా కూరగాయాలను తన న్యూట్రిషన్ ప్లాన్‌లో భాగం చేసుకున్నాడు. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ను అందుకోగల్గుతున్నాడు. దీనికి తోడు ప్రతీరోజు రెండు కప్‌ల కాఫీ సేవించే ఈ డాషింగ్ క్రికెటర్.. చక్కెర కల్గిన కూల్‌డ్రింక్స్, గ్లూటెన్‌కు చాలా దూరంగా ఉంటాడు. కార్బొహైడ్రేట్ల కోసం స్మూతిస్, స్ప్రౌట్స్, సలాడ్స్ తింటాడు.
ఇక వర్కవుట్ల విషయానికొస్తే.. కోహ్లీ గంటల కొద్ది వ్యాయామం చేసి క్యాలరీలను కరిగిస్తూ ఉంటాడు. వారంలో ఐదు వారాల పాటు జిమ్‌లో వ్యాయామం చేసే కోహ్లీ రెండు రోజులు మాత్రం శరీరానికి విశ్రాంతి ఇస్తాడట. ముఖ్యంగా వెయిట్‌లిఫ్టింగ్, కార్డియో వాస్క్యులర్(Cardio Vascular) వర్కవుట్ల కాంబినేషన్ కోహ్లీ ఫిట్నెస్ మంత్ర అని చెప్పొచ్చు.
జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లీ
దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యమే కాకుండా కండరాల పటుత్వం, బాడీ స్ట్రెంథ్, లోయర్ బాడీ మస్క్యులర్ టోనింగ్‌కు దోహదపడనుంది. ఆఫ్ సీజన్లో వెన్నుభాగం పటుత్వంతో పాటు కాళ్లు, కండరాల పరిమాణాన్నిమరింత పెంచుకునేందుకు కోహ్లీ జిమ్‌లో చెమటోడుస్తాడట. ఇలా తనదైన ఫిట్నెస్ మంత్రతో ఎల్లప్పుడూ హుషారుగా కనిపించే కోహ్లీ.. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని అభిమానులందరూ ఆశిస్తున్నారు.