హైదరాబాద్, ఆట ప్రతినిధి: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లకు ప్రమాదం తప్పింది. రైజర్స్ ఆటగాళ్లు బస చేస్తున్న పార్క్ హయత్ హోటల్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా హోటల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పరిస్థితిని అంచనా వేశారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణమేంటో ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 17న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం ప్రమాదం జరిగిన సమయంలోనే రైజర్స్ ప్లేయర్లు ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరి వెళ్లారు. దీంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని హోటల్ యాజమాన్యం పేర్కొంది.