జైపూర్: ఐపీఎల్ క్రికెటర్ యశ్ దయాల్(Yash Dayal)పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఆ ఆర్సీబీ బౌలర్‌పై యూపీలో ఓ కేసు ఉన్న విషయం తెలిసిందే. జైపూర్‌లోని సంగనీర్ పోలీస్ స్టేషన్లో యశ్ దయాల్‌పై కేసు బుక్ అయినట్లు ఓ ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. రెండేళ్లుగా ఆ మైనర్ బాలికను రేప్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రికెట్ కెరీర్ కల్పిస్తానని చెప్పి 17 ఏళ్ల అమ్మాయిని యశ్ దయాల్ లైంగికంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సితాపురలోని ఓ హోటల్‌కు ఆ బాలికను రమ్మని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇటీవలే అలహాబాద్ హైకోర్టు దయాల్‌కు రక్షణ కల్పించిన విషయం తెలిసిందే. ఓ మహిళను రేప్ చేసిన కేసులో అతన్ని అరెస్టు చేయరాదు అని ఇటీవల అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. జస్టిస్ సిద్ధార్ధ వర్మ, అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆ ఆదేశాలు జారీ చేసింది. అరెస్టుపై స్టే విధించాలని దయాల్ పెట్టుకున్న పిటీషన్‌కు ధర్మాసనం స్పందించింది.
27 ఏళ్ల ఆర్సీబీ క్రికెటర్ దయాల్‌పై జూలై 6వ తేదీన కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ జిల్లాలోని ఇందిరాపురం పోలీసు స్టేషన్లో ఆ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 69వ సెక్షన్(మాటలతో మోసం చేసి, లైంగికంగా వాడుకోవడం) కింద కేసు బుక్ చేశారు.