ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడినా విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అయితే ఈ సిరీస్ లో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న టీమిండియా.. రెండు మ్యాచులు ఓడినా తిరిగి పుంజుకోవడం గొప్ప విషయమని పాకిస్తాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు.
విశాఖలో ముగిసిన మూడో మ్యాచ్ అనంతరం అతడు తన యూట్యూబ్ చానెల్ లో ఇంజమామ్ మాట్లాడుతూ.. ‘సిరీస్ నిలుపుకునేందుకు భారత్ కు ఇంకా అవకాశాలున్నాయి. ఇప్పుడు ఒత్తిడంతా సౌతాఫ్రికా మీదే. ఎందుకంటే భారత్ లో భారత్ ను ఓడించడం అనేది సాధారణ విషయం కాదు. అదీగాక టీమిండియా బ్యాటింగ్ కు వెన్నెముకగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు గైర్హాజరీలో యువ భారత్ అద్భుతంగా పుంజుకుంది. ఇది ప్రశంసనీయం..’ అని తెలిపాడు.
అంతేగాక.. ‘ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లు బాగా బ్యాటింగ్ చేశారు. దీంతో భారత్ ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. భారత బ్యాటింగ్ లోతును ఇది చెప్పకనే చెబుతున్నది. నలుగురైదుగురు తప్ప జట్టులో మిగతావారంతా కొత్తవాళ్లే అయినా వాళ్లు చూపిన తెగువ అభినందనీయం. వారి పోరాటం చూడముచ్చటగా ఉంది. ద్రావిడ్ ఇప్పటికే అండర్-19 జట్టుతో పనిచేసిన కోచింగ్ అనుభవంతో ఇక్కడ కూడా కుర్రాళ్లకు మార్గనిర్దేశకుడిగా నిలుస్తున్నాడు..’ అని ఇంజమామ్ చెప్పాడు.
ఢిల్లీ, కటక్ లలో జరిగిన రెండు మ్యాచులలో ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన భారత జట్టు విశాఖపట్నంలో మంగళవారం రాత్రి జరిగిన మూడో మ్యాచ్ లో సఫారీలను 48 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.