Lockie Ferguson : ఆరేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ సెమీస్ ఫైనల్లో భారత జట్టు ఓటమిని ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు. మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ కెరీర్‌ను ముగించింది కూడా ఈ మ్యాచ్‌లో రనౌట్ తర్వాతే. టీమిండియా ఫ్యాన్స్ గుండెల్లో మానని గాయంలా ఉన్న ఈ సెమీస్ పోరును న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు తాను సంధించిన బంతిని ధోనీ వదిలేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కివీస్ పేసర్.
ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2019 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ సారథ్యంలోని భారత్ అదిరే విజయాలతో సెమీస్ చేరింది. రోహిత్ శర్మ ఐదు శతకాలతో భీకర ఫామ్‌లో ఉండడంతో టీమిండియా అలవోకగా న్యూజిలాండ్‌ను ఓడిస్తుందని అనుకున్నారంతా. కానీ, కివీస్ జట్టు అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్ధి నిర్దేశించిన 240 పరుగుల ఛేదనలో 31 బంతుల్లో 52 అవసరమయ్యాయి. ఆ దశలో క్రీజులో ఉ ఉన్న ధోనీ సాధించాల్సిన రన్‌రేట్ 10 ఉన్నా తన ఓవర్లో చివరి బంతిని వృథా చేశాడని ఫెర్గూసన్ తెలిపాడు.
MS Dhoni Runout 2019 world cup by Guptil#MSDhoni𓃵 pic.twitter.com/DyCADjnp0d
— AllRounder Analyyst (@AllAnalyysstt) October 30, 2024
’45వ ఓవర్లో నేను సంధించిన చివరి బంతికి ధోనీ సిక్స్, ఫోర్ కొడతాడనుకున్నా. కానీ, అతడు మాత్రం బంతిని వదిలేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు. దాంతో.. అతడు తర్వాత అలాంటి బంతి వేస్తే కచ్చితంగా ఆడుతాడని అనుకున్నా. అనుకున్నట్టే 49వ ఓవర్లో ఫీల్డర్ తల మీదుగా స్టాండ్స్‌లోకి పంపాడు ధోనీ. ఏ బంతిని ఎప్పుడు ఎలా ఆడాలి? అనేది లెక్కేసుకుని మరీ ఆడుతాడతడు. కానీ, అనూహ్యంగా గుప్టిల్ అతడిని రనౌట్ చేసి మ్యాచ్‌ను మా వైపు తిప్పాడు’ అని ఫెర్గూసన్ వెల్లడించాడు.
ఛేదనలో అర్ధ శతకంతో జట్టును గెలుపు దిశగా నడిపిన ధోనీ రనౌటయ్యాక భారత ఓటమి ఖాయమైంది. 49.3 ఓవర్లో ఆలౌటైన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడి టోర్ని నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో రనౌటైన టైమ్ 19:29ను తన వీడ్కోలు సమయంగా భావించాలని ధోనీ చెప్పిన విషయం తెలిసిందే.